Gujarat hooch tragedy: గుజరాత్‌లోని బోటాడ్ జిల్లాలో కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 42కు చేరింది. ఈ విషయాన్ని హోంమంత్రి హర్ష్ సంఘ్వీ బుధవారం ప్రకటించారు. భావ్‌నగర్, బోటాడ్, బర్వాలాలోని ఆసుపత్రుల్లో అనేక మంది చికిత్స పొందుతున్న బాధితులను అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రి, సర్ టీ ఆస్పత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు. మంత్రి ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ క్రమంలో ఓ బాధితుడి ఆరోగ్య పరిస్థితిని అడగగా.. తమకు నాటు సారా ఇప్పించాలని డిమాండ్ చేశారు. కల్తీమద్యంపై ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గుజరాత్లో మద్యపానం నిషేధం ఉన్నందున మద్యం విక్రయించిన, తాగినవారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిపైనా చర్యలు ఉంటాయన్నారు.
బోటాడ్ జిల్లాతో పాటు, అహ్మదాబాద్‌లోని ధంధూకా ప్రాంతంలో అనేక మంది ప్రజలు కల్తీ మద్యానికి బాధితులుగా మారారని అధికారులు తెలిపారు. కల్తీ మద్యం తయారుచేస్తున్న బోటాడ్ జిల్లాకు చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.తాజాగా, పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం పేరుతో ప్రమాదకర రసాయనాలను విక్రయించినట్లు తేలింది. మిథైల్ ఆల్కహాల్ అనే రసాయనాన్ని నీటిలో కలిపి.. మద్యం పేరిట విక్రయాలు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. రూ.20కే సీసా చొప్పున వీటిని అమ్మినట్లు చెప్పారు. బాధితుల్లో చాలా మంది మిథనాల్ కలిపిన రసాయనాన్నే సేవించినట్లు తెలిపారు. మద్యంలో 99 శాతం రసాయనాలే ఉన్నాయని చెప్పారు.
సోమవారం బోటాడ్ జిల్లాలోని రోజిద్ గ్రామంలోని పలువురు, ధందుక, భావ్‌నగర్ ప్రాంతాల్లో కొందరు కల్తీ మద్యం తాగి అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. విచారణకు సిట్‌ను ఏర్పాటు చేసింది. గుజరాత్ టెర్రరిజం స్క్వాడ్, అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ కూడా ఈ దర్యాప్తులో భాగమయ్యాయి.
ఇదీ చదవండి: అర్పిత ఇంట్లో మళ్లీ భారీగా నోట్ల కట్టలు.. యంత్రాలతో లెక్కించేసరికి...
ఉద్రిక్తతలకు దారితీసిన భాజపా నేత హత్య.. ఎంపీ, ఎమ్మెల్యేలకు నిరసన సెగ