Ganga Ghat open classroom: ఉద్యోగార్థుల కోసం గంగా తీరమే ఓపెన్ క్లాస్‌రూంగా మారిపోయింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం చదువుకునే విద్యార్థులకు మంచి వేదిక అవుతోంది. బిహార్ పట్నాలోని గంగా కాలేజ్ ఘాట్‌కు వందలాది మంది ఉద్యోగార్థులు చదువుకునేందుకు వస్తున్నారు. ఉచితంగా క్లాసులు చెప్తున్న నేపథ్యంలో బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ఔత్సాహికులు తరలి వస్తున్నారు. ఎస్కే ఝా అనే ఇంజినీర్ ఉపాధ్యాయుడిగా మారి.. వీరందరి నుంచి ఎలాంటి రుసుం తీసుకోకుండానే క్లాసులు చెబుతున్నారు.
![patna ganga college ghat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15036287_fqb_egyaqail-2t.jpg)
![patna ganga college ghat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15036287_fqb_aojaqackcas.jpg)
patna ganga college ghat: ప్రస్తుతం 12 వేల నుంచి 14 వేల మంది ఔత్సాహికులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారని ఎస్కే ఝా తెలిపారు. 'ఎక్కువ మంది విద్యార్థులు ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారు. వీరంతా ఎన్టీపీసీ నిర్వహించే తొలి విడత పరీక్షలో అర్హత సాధించారు' అని వివరించారు. ఉచితంగా క్లాసులు చెప్పడమే కాకుండా.. వీరికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 30-35 మందితో కూడిన బృందం ఆయనకు సహాయం అందిస్తోంది. వారానికి రెండుసార్లు ఈ విద్యార్థులకు క్లాసులు చెబుతున్నారు ఝా. ఉద్యోగాలకు ఎలా సన్నద్ధమవ్వాలనే విషయంపై మార్గదర్శనం చేస్తున్నారు.
![Ganga Ghat in Patna](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15036287_fqb_cuzacamgizi.jpg)
ఎస్కే ఝా చెప్పే విషయాలు ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమయ్యేందుకు విశేషంగా ఉపయోగపడుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. 'రోజు ఉదయం 6గంటలకు ఇక్కడికి వస్తాను. 120 ప్రశ్నలతో కూడిన క్వశ్చన్ పేపర్ ఇస్తారు. 90 నిమిషాల సమయంలో దీన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలు మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి' అని ఔరంగాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి చెప్పుకొచ్చాడు.
![patna ganga college ghat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15036287_fqcacrdaqaertvj.jpg)
ఇదీ చదవండి: నడిరోడ్డుపై మహిళ వీరంగం.. స్కూటీని ఢీకొట్టాడని యువకుడిపై దాడి