SC Freebies: ఎన్నికల్లో ఇచ్చిన ఉచిత హామీలను నెరవేర్చని కారణంగా రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేయడం సమంజసం కాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఉచిత హామీలపై మార్గదర్శకాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషిన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పార్టీల గుర్తింపును రద్దు చేయాలనడం ప్రజాస్వామ్య వ్యతిరేకమన్న సీజేఐ జస్టిస్. ఎన్.వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఇప్పటికే శాసన వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామన్న అపవాదు న్యాయవ్యవస్థపై ఉందన్నారు.
రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలపై పూర్తి వివరాలను సుప్రీంకోర్టు ధర్మాసనం కోరింది. పూర్తి డేటా అందిన తర్వాతే ఉచిత హామీలపై ఏ మేరకు జోక్యం చేసుకోవాలన్నది పరిశీలిస్తామని జస్టిస్. ఎన్.వి రమణ ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు ఉచిత హామీల పరిశీలనకు సంబంధించి ఒక కమిటీని నియమించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సుప్రీంకోర్టుకు.. కేంద్రం, ఎన్నికల సంఘం తెలిపింది. ఈ కమిటీలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ లేదా మాజీ సీఈసీ, ఆర్థిక సంఘం ఛైర్మన్, ఆర్‌బీఐ గవర్నర్ లేదా మాజీ గవర్నర్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, నీతి ఆయోగ్ సీఈఓ, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ ఛైర్మన్ సభ్యులుగా ఉంటారని ఈసీ.. కోర్టుకు విన్నవించింది.
అంతకుముందు ఉచిత హామీలకు సంబంధించి తాను దాఖలు చేసిన పిటిషిన్‌పై న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. ఉచితాలు, సాంఘిక సంక్షేమ పథకాలు రెండూ వేర్వేరు అంశాలని.. వీటిని ఒకే గాటిన గట్టకూడదని సూచించారు. వాదోపవాదాలు విన్న అనంతరం విచారణను ఈ నెల 17కు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.
ఇవీ చూడండి: 'ఉచిత పథకాలతో ఆర్థిక విధ్వంసం.. వ్యవస్థల స్థిరత్వానికి పెను ప్రమాదం'