సాధారణంగా రాజకీయ నాయకులు తీరిక లేకుండా గడుపుతారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే మాత్రం ఐదు పదుల వయసులోనూ చదువుపై ఆసక్తి కనబరిచారు. ఆయనే భాజపా మాజీ ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా. 12వ తరగతి పరీక్షలు రాసేందుకు విద్యార్థులతో కలిసి ఎగ్జామ్ హాల్‌కు వచ్చారు. సాదాసీదా వ్యక్తిలా ప్యాడ్, మరో చేతిలో వాటర్ బాటిల్ పట్టుకుని సింపుల్‌గా పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. దీంతో విద్యార్థులందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడేం జరిగిందంటే?
రాజేశ్ మిశ్రా(51) ఫిబ్రవరి 16న.. 12వ తరగతి పరీక్షలు రాయడానికి పరీక్షా కేంద్రానికి వెళ్లారు. 'లా' చదవాలనే ఆసక్తితో 51 ఏళ్ల వయసులో 12వ తరగతి పరీక్షలు రాస్తున్నానని ఆయన తెలిపారు. మంచి రాజకీయ నాయకుడిగా చురుగ్గా ఉంటూనే 12వ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తానని తెలిపారు రాజేశ్. ఆయన 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున బరేలీలోని బిత్రి చైన్‌పూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు పార్టీ అధిష్ఠానం టికెట్ నిరాకరించింది. అయితే ఆయన అప్పటి నుంచి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో రాజకీయాలతో పాటు చదువును కొనసాగించాలని మిశ్రా నిర్ణయించుకున్నారు. అయితే 51 ఏళ్ల వయసులో పరీక్షలు రాయటం వల్ల చిన్నవయసు వారిని కలిసే అవకాశం ఉంటుందని మిశ్రా అభిప్రాయపడ్డారు. 12వ తరగతి పరీక్షలు రాసిన రాజేశ్ మిశ్రాకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ముగ్గురు పిల్లలు ఉన్నారు.
"పరీక్ష రాసేందుకు వెళ్లినప్పుడు నన్ను చూసి విద్యార్థులు ఆశ్చర్యపోయారు. కానీ వారు ఒక రాజకీయ నాయకుడు పరీక్ష రాయడానికి తమతో పాటు వచ్చారని సంతోషపడ్డారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారు.. వారి తరఫున వాదించేందుకు మంచి న్యాయవాదిని ఏర్పాటు చేసుకోలేరు. అందుకే లా చదివి అలాంటి వారికి తరఫున కేసులు వాదించాలని అనుకుంటున్నాను. అందుకే ప్రస్తుతం 12వ తరగతి పరీక్షలు రాశా. నేను రాత్రి 11 నుంచి ఒంటి గంట వరకు చదువుతా. పగలు కూడా వీలైనప్పుడు చదువుతుంటాను. నాకు సైన్స్ అంటే ఆసక్తి. కానీ లా చదివేందుకు ఉపయోగపడుతుందని ఆర్ట్స్ సబ్జెక్ట్‌లు చదువుతున్నా. నా పిల్లలు నాకు స్టడీ విషయంలో సలహాలు ఇస్తుంటారు. అలాగే పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి, ఒత్తిడిని తగ్గించుకునేందుకు టిప్స్ చెబుతుంటారు. ఏకాగ్రతే విజయానికి చిహ్నం. అందుకే విద్యార్థులు చదువుపట్ల ఆసక్తిగా ఉండాలి. నేను చదువు పట్ల చాలా ఆసక్తిగా ఉంటా."
--రాజేశ్ మిశ్రా, మాజీ ఎమ్మెల్యే