ముంబయి ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్టులో రూ.50కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడింది. జింబాబ్వే దేశీయులైన ఇద్దరు వ్యక్తులపై అనుమానంతో డీఆర్ఐ(డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు సోదాలు చేశారు. ఈ తనిఖీలో భాగంగా ఆ వ్యక్తుల నుంచి 7.9కేజీల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. నిఘా వర్గాల సమాచారంతో డీఆర్ఐ ముంబయి జోనల్ యూనిట్ అప్రమత్తమయింది. అనుమానంతో అడిస్ అబాబా(ఇథియోపియా) నుంచి భారత్‌కు వస్తున్న ఇద్దరు ప్రయాణికులను అధికారులు అడ్డగించారు. వారిద్దరినీ చెక్ చేయగా ఓ బ్యాగ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు అరల్లో లేత గోధుమరంగులో రెండు పౌడర్ ప్యాకెట్స్ లభించాయి. ఆ పౌడర్ ప్యాకెట్లను పరీక్షించగా హెరాయిన్ అని అధికారులు గుర్తించారు.
మొత్తం 7.9కేజీల బరువున్న ఆ హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.50కోట్ల విలువుంటుందని ఓ అధికారి తెలిపారు. నిందితులపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ప్రత్యేక కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు ఆయన తెలిపారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న డ్రగ్స్ సిండికేట్‌ను పట్టుకునేందుకు డీఆర్ఐ తదుపరి విచారణ చేపడుతున్నట్లు అధికారులు చెప్పారు.
కేరళ విమానాశ్రయంలో రూ.48.5లక్షల బంగారం పట్టివేత..
కేరళ కొచ్చి విమానాశ్రయంలో రూ.48.5లక్షల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తిపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు సోదా చేయగా క్యాప్స్యూల్స్ రూపంలో శరీరంలో దాచిన 1192 గ్రాముల బంగారం లభ్యమైంది. అతని వద్ద ఉన్న మూడు బంగారు గొలుసులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.