సెంట్రల్ యూనివర్సిటీలతోపాటు ఐఐటీ, ఐఐఎం వంటి టెక్నికల్ లేదా నాన్‌టెక్నికల్ విద్యాసంస్థల్లో హిందీ భాషను తప్పనిసరి చేయాలంటూ అమిత్ షా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫార్సులు చేసిన విషయంపై దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. పలు రాజకీయ పార్టీల నేతలు ఈ సిఫార్సులను వ్యతిరేకిస్తున్నారు. దేశంలో చాలా అధికారిక భాషలుండగా హిందీనే ప్రధాన భాషగా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కేరళ సీఎం పినరయి విజయన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. మరోవైపు, కేంద్రం ప్రయత్నాలను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు.
హిందీని ప్రధాన భాషగా మార్చొద్దు..
"విద్యా సంస్థలు, ప్రభుత్వ నియామకాల్లో హిందీని తప్పనిసరి చేసే విషయంలో నిరుద్యోగులు, విద్యార్థులకు ఎన్నో భయాలు నెలకొన్నాయి. భిన్నత్వంలో ఏకత్వం అనే భావనకు ప్రతీకగా నిలిచే భారత్‌లో ఏ ఒక్క భాషనూ ఇతర భాషల కంటే ఎక్కువ చేసినా అది దేశ సమగ్రతను దెబ్బతీస్తుంది. దేశంలో చాలా భాషలు అధికారికంగా ఉన్నప్పుడు హిందీని ప్రధాన భాషగా పేర్కొనొద్దు" అని కోరుతూ ప్రధాని మోదీకి కేరళ సీఎం విజయన్ లేఖ రాశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
మాతృభాషపై ఉన్న ప్రేమను పరీక్షించొద్దు
"అన్ని రాష్ట్రాల భాషలను అధికారిక భాషలుగానే కేంద్ర ప్రభుత్వం చూడాలి. ఇందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ హిందీని తప్పనిసరి చేసే ప్రయత్నం చేయొద్దు. మా మాతృభాషపై ఉన్న అభిమానాన్ని పరీక్షించాలని ప్రయత్నించొద్దు" అంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడే కాకుండా మాతృ భాషకు మద్దతిచ్చే ఏ రాష్ట్రమూ దీనిని ఆమోదించదన్నారు. దేశంలో హిందీ మాట్లాడే వారి కన్నా... ఆ భాషను మాట్లాడని వారే ఎక్కువమంది ఉన్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈ ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ప్రధాని మోదీని తమిళనాడు సీఎం కోరారు.
హిందీ వ్యతిరేక ఉద్యమం రావాలని కోరుకోవట్లేదు
డీఎంకే ఎంపీ కనిమొళి సైతం ఈ అంశంపై విమర్శలు వ్యక్తం చేశారు. ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ.. ఏ భాషనూ ఇతరులపై రుద్దే ప్రయత్నం చేయొద్దని కేంద్రానికి హితవు పలికారు. 'స్థానికంగా మాట్లాడుకోవడానికి మాతృభాష... ప్రపంచంతో మాట్లాడేందుకు ఆంగ్లభాష అని మాజీ సీఎం అన్నాదురై చెప్పారు. ప్రస్తుతం తమిళనాడులోని ప్రతి పాఠశాలలో తమిళం తప్పనిసరి భాషగా ఉంది. తమిళమే మా గుర్తింపు. ఎవరైనా గానీ, ఎవరిపైన అయినా ఇతర భాషలను రుద్దకూడదు. మరో హిందీ వ్యతిరేక ఉద్యమం రావాలని మేం కోరుకోవడం లేదు' అని స్పష్టం చేశారు.
నచ్చిన భాషలో పరీక్షలు రాయనీయండి
ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం స్పందించారు. కర్ణాటకలో భారత్ జోడో యాత్ర చేస్తున్న ఆయన.. చిత్రదుర్గలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో యువతను ఉద్దేశించి ప్రసంగించారు. "భాష అనేది మాట్లాడుకోవడానికి ఉపయోగించేది మాత్రమే కాదు. భాష అనేది ఓ విశ్వాసం, ఓ భావన. భాషలో ఓ చరిత్ర ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి దాని భాషను ఉపయోగించుకునే హక్కు ఉంది. విద్యార్థులు తమకు వచ్చిన భాషలోనే పరీక్షలు రాయాలని అనుకుంటే వారిని అందుకు అనుమతించాలి" అని రాహుల్ గాంధీ చెప్పారు.
ఆమోదయోగ్యం కాదు: ఏచూరి
ఒకే దేశం, ఒకే సంప్రదాయం, ఒకే భాష అనే భావనతో ఉండే ఆర్‌ఎస్‌ఎస్ నుంచి వచ్చిన ఇటువంటి ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి, భాషా వైవిధ్యానికి విరుద్ధంగా ఉండే ‘హిందీ, హిందు, హిందూయిజం’ అనేవి ఆమోదయోగ్యం కాదన్నారు.
జాతీయ భాషంటూ ఏదీ లేదు.. కేటీఆర్
భారత్‌కు జాతీయ భాష అంటూ ఏదీ లేదని.. ఇతర అధికారిక భాషల మాదిరిగానే హిందీ కూడా ఓ అధికారిక భాషేనని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ నియామకాల్లో హిందీని తప్పనిసరి చేస్తూ, ఆ భాషను రాష్ట్రాలపై రుద్దడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు కేటీఆర్. భాషను ఎంచుకునే హక్కు భారతీయులకు ఉండాలన్న ఆయన.. హిందీని బలవంతంగా అమలు చేయడానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు.
సెంట్రల్ యూనివర్సిటీలతోపాటు ఐఐటీ, ఐఐఎం వంటి విద్యాసంస్థల్లో హిందీని తప్పనిసరి చేయాలంటూ అమిత్ షా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ సూచించిన విషయం తెలిసిందే. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో హిందీని, మిగతా రాష్ట్రాల్లో స్థానిక భాషను అమలు చేయాలని, అలాగే ఇంగ్లిష్‌ను ఐచ్ఛికం చేయాలని పేర్కొంది. ఆ నివేదిక రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు గత నెలలో చేరింది. ఈ సూచలనపైనే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.