Obesity surgery: ఊబకాయంతో బాధపడుతూ.. కనీసం ఊపిరి తీసుకోలేని వ్యక్తికి శస్త్రచికిత్సలు చేసి సాధారణ స్థితికి తీసుకొచ్చారు కర్ణాటక బెంగుళూరులోని మణిపాల్ ఆస్పత్రి వైద్యులు.
చిన్నపిల్లాడిలా పాకుతూ..
నగరానికి చెందిన సుఖ్మీత్ సింగ్ వయసు 38 ఏళ్లు. ఎత్తు 176 సెంటిమీటర్లు. బరువు 235 కిలోలు. గతకొన్నేళ్లుగా ఊబకాయంతో బాధ పడుతున్నాడు. ఇటీవల సుఖ్మీత్ ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడటం సహా అటూఇటూ కదల్లేక అవస్థలు పడుతున్నాడు. తన బరువును తానే మోయలేక.. లేచి నిల్చొనే పరిస్థితి కూడా లేదు. దీంతో ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. ఇందుకోసం ఆరుగురు వైద్య సిబ్బంది.. సుఖ్మీత్ ఇంటికి చేరుకున్నారు. అయితే బాధితుడిని ఎత్తలేక నిస్సహాయులయ్యారు. సుఖ్మీత్.. పిసిపిల్లాడిలా పాకుతూ తలుపు వరకు చేరుకున్నాడు. అక్కడి నుంచి అతి కష్టం మీద మిల్లర్స్ రోడ్లోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు.
ఎంఆర్ఐకి బరువు భారమై..
Bariatric surgery: అక్కడ సుఖ్మీత్ను పరీక్షించిన ఆర్థోపెడీషియన్ ఇమ్రాన్.. ఎక్స్రే తీయమని సూచించారు. అయినా పరిస్థితి ఏంటన్నది తెలియలేదు. ఎంఆర్ఐ స్కానింగ్ తీయాలని సూచించారు. అయితే మిషన్ సరిపోదని అక్కడ సిబ్బంది తెలిపారు. దీంతో బరువు తగ్గడం ఒక్కటే సుఖ్మీత్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని భావించారు. బేరియాట్రిక్, మెటబాలిక్ శస్త్రచికిత్సలు చేయడం ఒక్కటే మార్గమనే ఆలోచనకు వచ్చారు. ఆ ఆపరేషన్ల బాధ్యతను.. బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ మొయినొద్దీన్కు అప్పగించారు.
చివరికిలా..
శస్త్రచికిత్సకు పది రోజులు ముందు.. సుఖ్మీత్ గుండె, ఊపిరితిత్తులు సహా ఇతర అవయవాల పనితీరును వైద్యులు నిశితంగా పరిశీలించారు. శస్త్రచికిత్సకు అతడ్ని అన్ని విధాల సిద్ధం చేశారు. అనంతరం మెటబాలిక్, బేరియాట్రిక్ నిపుణులు డాక్టర్ మొయిన్.. అత్యాధునిక వైద్య పరికరాల సాయంతో సుఖ్మీత్ పొత్తికడుపు భాగంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించారు. తద్వారా 34 కిలోల బరువును తగ్గించారు. దీంతో సుఖ్మీత్ సహజంగా ఊపిరి తీసుకునే పరిస్థితితో పాటు సెల్యులైటిస్ మెరుగుపడిందని.. వైద్యులు పేర్కొన్నారు. మూడు రోజుల పాటు సుఖ్మీత్ను పర్యవేక్షించిన డిశ్చార్జ్ చేశారు. ఆపరేషన్ జరిగిన రోజు సాయంత్రమే సుఖ్మీత్ తనంతట తాను నడవగలిగాడని వైద్యులు తెలిపారు.
ఇదీ చూడండి: Kerala Model Death: కేరళ మోడల్స్ మృతికి కారణం అతడే!