CAA Citizenship : మన దేశానికి పొరుగునున్న అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ల నుంచి వలస వచ్చే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేసే అధికారాన్ని 9 రాష్ట్రాల పరిధిలోని 31 జిల్లాల కలెక్టర్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులకు కూడా ఈ అధికారాన్ని కల్పించింది. దీని ప్రకారం గత ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి డిసెంబరు 31 వరకు తొమ్మిది నెలల కాలంలో మొత్తం 1,414 మంది విదేశీయులకు భారత పౌరసత్వం లభించింది. ఈ విషయాన్ని 2021-22 వార్షిక నివేదిక ద్వారా కేంద్ర హోం శాఖ వెల్లడించింది. భారత పౌరసత్వం పొందిన వీరందరూ అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లకు చెందిన ముస్లిమేతర మైనారిటీలు. వీరికి 2019లో తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ద్వారా కాకుండా 1955నాటి సిటిజెన్‌షిప్ యాక్ట్ ద్వారా పౌరసత్వం మంజూరు చేయడం విశేషం.
సీఏఏ ప్రకారం.. ఆ మూడు దేశాల్లో వేధింపులకు గురై అక్కడి నుంచి వచ్చే ముస్లిమేతర మైనారిటీలకు భారత పౌరసత్వాన్ని కల్పించవచ్చు. అయితే, సీఏఏ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ఇంకా ఖరారు చేయకపోవడంతో ఆ చట్టం ఇంకా అమలులోకి రాలేదు. 2014, డిసెంబరు 31వ తేదీలోగా భారత్‌కు వలస వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రిస్టియన్లకు భారత పౌరసత్వాన్ని కల్పించేందుకు సీఏఏ(2019)ను నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చింది. దీనికి వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించిన ఆరు నెలల్లోగా నిబంధనలను ఖరారు చేయాల్సి ఉండగా...ఇప్పటి వరకూ ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. దీని కోసం పార్లమెంటరీ కమిటీల నుంచి ఏడోసారి గడువు పొడిగింపును కేంద్రం పొందింది.
ఆ 9 రాష్ట్రాలివే... విదేశాల నుంచి వలస వచ్చే ముస్లిమేతరులకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేసే అధికారం ఉన్న రాష్ట్రాలు...గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హరియాణా, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, దిల్లీ, మహారాష్ట్ర. ఈ రాష్ట్రాల పరిధిలోని 31 జిల్లాల కలెక్టర్లకు, హోంశాఖ కార్యదర్శులకు 1955 చట్టానికి అనుగుణంగా పౌరసత్వ మంజూరు అధికారాలున్నాయి.
- గుజరాత్‌లోని ఆణంద్, మెహసాణా జిల్లా పాలనాధికారులకు గత నెలలో పౌరసత్వ మంజూరు అధికారాలు దఖలుపడ్డాయి. అంతకుముందు 29 జిల్లాల కలెక్టర్లకు మాత్రమే ఈ అనుమతి ఉంది.
- వలసల సమస్య రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న పశ్చిమబెంగాల్, అస్సాం రాష్ట్రాల పరిధిలోని ఏ ఒక్క జిల్లా కలెక్టర్‌కూ ఈ అధికారాన్ని కల్పించలేదు.
ఇదీ చూడండి: Himachal Pradesh Election : భాజపాకు పింఛను టెన్షన్.. హామీలతో దూసుకెళ్తున్న కాంగ్రెస్
'ఎమ్మెల్యేల కోసం బేరాలాడుతున్న వీడియోలు చూశాం.. వాటి గురించి మాట్లాడరేం?'