పండుగలు వచ్చాయంటే సంస్థ యజమానులు.. ఉద్యోగులకు బోనస్‌లు, కానుకలు ఇవ్వడం సహజమే. ఇప్పటివరకు పలువురు వ్యాపారులు కార్లు, అపార్ట్మెంట్లు, ఆభరణాలు ఉద్యోగులకు కానుకగా ఇచ్చారని విన్నాం. అయితే గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన గోవింద్ ధోలాకియా అనే వ్యాపారవేత్త మాత్రం దీపావళి కానుకగా తమ సంస్థలోని 1,000 మంది ఉద్యోగులకు సౌర ఫలకాలను అందించారు.
ఎస్ఆర్కే ఎక్స్పోర్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యజమాని గోవింద్ ధోలాకియా ప్రతి సంవత్సరం మాకు దీపావళికి కానుకలు ఇస్తారు. గతేడాది గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. ఈ ఏడాది అంతకన్నా మేలైన సౌర ఫలకాలను అందించారు. ఈ సోలార్ ప్యానళ్ల వల్ల పర్యావరణానికి హాని ఉండదు. విద్యుత్ ఖర్చులు మిగులుతాయి. నాతో సహా ఉద్యోగులందరూ లాభపడతారు.
--అశిశ్, ఉద్యోగి

గ్లోబల్ వార్మింగ్ వల్ల పర్యావరణం దెబ్బతింటోందని అన్నారు యజమాని గోవింద్ ధోలాకియా. అందుకే 1,000 మంది ఉద్యోగులకు సోలార్ ప్యానళ్లను కానుకగా ఇచ్చామని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడేందుకు, ఉద్యోగులకు విద్యుత్‌కు అయ్యే ఖర్చును తగ్గేందుకు కంపెనీలోని ఉద్యోగులకు సౌర ఫలకాలను అందిస్తున్నామని పేర్కొన్నారు.

మరో ఉద్యోగి జయేశ్ మాట్లాడుతూ 'నేను గత 15 సంవత్సరాలుగా కంపెనీలో పనిచేస్తున్నా. ప్రతి ఏడాది దీపావళికి కానుకలు అందజేస్తారు. ఈ సారి సోలార్ ప్యానెళ్లను అందించారు. ఈ ప్యానళ్ల వల్ల విద్యుత్ ఖర్చు తగ్గుతుంది. మా యజమాని మమ్మల్ని సొంత కుటుంబంలా చూసుకుంటారు' అని తెలిపారు.


ఇవీ చదవండి: 'విద్వేష ప్రసంగాలు చేసేవారిపై తక్షణ చర్యలు.. ఫిర్యాదు అందకపోయినా..'
'ఈయన తాగుబోతు!'.. 52వేల ఇళ్లకు పోస్టర్లు అంటిస్తున్న ప్రభుత్వం