ఝార్ఖండ్, ధన్‌బాద్ జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్ మృతి కేసులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. మొదట హిట్ అండ్ రన్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు... చివరకు ఇది పథకం ప్రకారం చేసిన హత్య అని ప్రాథమికంగా తేల్చారు.
అసలేం జరిగింది?
జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్.. బుధవారం తెల్లవారుజామున జాగింగ్ చేస్తుండగా ఓ ఆటో వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో జడ్జి అక్కడికక్కడే మృతి చెందారు.
హిట్ అండ్ రన్ కేసుగా..
మొదట హిట్ అండ్ రన్ కింద కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. కానీ సీసీటీవీ దృశ్యాలను పరిశీలించాక.. కావాలనే ఆనంద్‌ను కావాలనే హత్యచేశారని నిర్ధరణకు వచ్చారు. ఆనంద్‌ను ఢీకొట్టిన ఆటోడ్రైవర్‌ను అరెస్ట్ చేశారు.
సుప్రీంకోర్టులో ప్రస్తావన..
ఈ కేసును సుప్రీంకోర్టులో ప్రస్తావించారు సుప్రీం లాయర్ వికాస్ సింగ్. ఈ కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే ఇదే విషయంపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ.. ఝార్ఖండ్ హైకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టిందని తెలిపారు.
వాళ్ల పనేనా?
ప్రస్తుతం ఆనంద్.. బొగ్గు మాఫియాకు సంబంధించి రంజయ్ సింగ్ మర్డర్ కేసును విచారిస్తున్నారు. ఈ కేసులో నిందితులైన అభినవ్ సింగ్, రవి ఠాకూర్ ఇటీవల బెయిల్ కోసం చేసుకున్న దరఖాస్తును జడ్జి ఆనంద్ తిరస్కరించారు. దీంతో పథకం ప్రకారమే.. ఆనంద్‌ను హత్యచేశారని పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: వందల పాములతో ఊరేగింపు- మెడకు చుట్టుకుని ఆడిస్తూ...