దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యాన్ని (air pollution in delhi) దృష్టిలో ఉంచుకొని అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ తరగతులు, బోర్డు పరీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు దిల్లీలో తరగతి బోధనను ఆపేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యూకేషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆదివారం ఉదయం గాలి నాణ్యత (air pollution in delhi) దారుణంగా పడిపోయిందని.. ఉదయం 9 గంటల సమయంలో గాలి నాణ్యత సూచిక 382 వద్ద నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. శనివారం.. ఈ సగటు 374గా ఉన్నట్లు పేర్కొన్నారు. దిల్లీ, పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యతపై ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అన్ని పాఠశాలలను వెంటనే మూసివేయాలని పర్యావరణ శాఖ ఆదేశించినట్లు దిల్లీ విద్యాశాఖ తెలిపింది. ఈ కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను మూసివేస్తున్నట్లు విద్యాశాఖ అదనపు డైరెక్టర్ రీటా శర్మ తెలిపారు. ఆన్‌లైన్ బోధన, బోర్డు పరీక్షలు గతంలో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
దిల్లీలో గాలి నాణ్యత అంతకంతకూ పెరుగతున్న నేపథ్యంలో పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం నవంబర్ 13న ప్రకటించింది.
నిషేధం కొనసాగింపు..
అత్యవసర సేవలు మినహా ఇతర ట్రక్కుల రాకపోకలపై ప్రస్తుతం ఉన్న నిషేధం సహా ప్రభుత్వోద్యోగులకు వర్క్‌ఫ్రం హోంను ఈనెల 26 వరకు పొడగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నిర్మాణ, కూల్చివేత పనులపై ప్రస్తుతం ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం తాజా ప్రకటనలో స్పష్టం చేయలేదు. అయితే ఇందుకు సంబంధించి ఆంక్షలను ప్రభుత్వం తొలగించినట్లు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.
ఇదీ చూడండి: దిల్లీ కాలుష్యంతో ప్రాణాలకు ముప్పు: నాసా