భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు చిలికిచిలికి గాలి వానలా మారాయి. పరిస్థితి రాహుల్ గాంధీ వర్సెస్ దిల్లీ పోలీసులుగా మారింది. ఇప్పటికే రెండు సార్లు నోటీసులు ఇచ్చిన పోలీసులు ఆదివారం నేరుగా ఆయన నివాసానికి వెళ్లారు. అయితే దాదాపు రెండు గంటలపాటు ప్రత్యేక బృందం వేచి చూశాక.. రాహుల్ వారిని కలిసినట్లు సమాచారం. జమ్ముకశ్మీర్‌లో భారత్ జోడో యాత్రలో భాగంగా కొందరు అత్యాచార బాధితుల గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించాలని కాంగ్రెస్ అగ్రనేతను దిల్లీ పోలీసులు కోరారు.
నోటీసులకు స్పందించిన రాహుల్
దిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్పందించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్రలో భాగంగా చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు 4 పేజీలు, 10 పాయింట్లతో లేఖ రాశారు. 8-10 రోజుల్లో పూర్తి వివరాలు సమర్పిస్తానని అందులో పేర్కొన్నారు. అదానీ వ్యవహారంపై తాను పోరాడినందుకే ఇలా చేశారన్నారు.
ఆ లేఖలో ఏం లేదు : దిల్లీ పోలీసులు
మరోవైపు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నుంచి సమాధానం వచ్చిందని తెలిపారు దిల్లీ పోలీసులు. కానీ ఈ లేఖలో ఆయన ఎలాంటి సమాచారం తెలపలేదని.. దీని వల్ల దర్యాప్తును ముందుకు తీసుకెళ్లలేమని స్పష్టం చేశారు. వచ్చే 8-10 రోజుల్లో పూర్తి వివరాలతో సమాధానం ఇస్తానని మాత్రమే లేఖలో పేర్కొనట్లు వెల్లడించారు.
అంతకుముందు రాహుల్ ఇంటికి దిల్లీ పోలీసులు పెద్ద సంఖ్యలో వెళ్లడంపై తీవ్ర దుమారం రేగింది. రాహుల్ నుంచి బాధితుల వివరాలు తెలుసుకుని.. ఆ బాధితులకు న్యాయం చేసే ఉద్దేశంతోనే వచ్చినట్లు దిల్లీ ప్రత్యేక కమిషనర్ ఎస్పీ హూడా తెలిపారు. రాహుల్‌కు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించలేదని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అగ్రనేత ఇంటికి వచ్చినట్లు ప్రత్యేక పోలీసు కమిషనర్ హూడా తెలిపారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున పోలీసు బలగాలు రాహుల్ ఇంటి వద్ద మోహరించాయి. అయితే రాహుల్ ఇంటికి పోలీసులు చేరుకున్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు పెద్దఎత్తున అక్కడకు చేరుకుని.. ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు ఆందోళన చేస్తున్న కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
బీజేపీ నేతలకు కూడా ఇలానే చేయాలి : కాంగ్రెస్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటికి పోలీసులు చేరుకుని నోటీసులు జారీ చేయడాన్ని ఆ పార్టీ ఖండించింది. రాజకీయ కక్షతోనే రాహుల్‌ను వేధిస్తున్నారని ఆరోపించింది. దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, సీనియర్ నేత జైరాం రమేశ్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు లేకుండా దిల్లీ పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడతారా అని గహ్లోత్ ప్రశ్నించారు. 8-10 రోజుల్లో వివరాలన్నీ అందిస్తానని రాహుల్ చెప్పినట్లు ఆయన వెల్లడించారు. రాజకీయ యాత్రల్లో భాగంగా ప్రతిపక్ష పార్టీ నేతల చేసిన వ్యాఖ్యలపై కేసులు పెట్టడం బాధాకరమన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ పార్టీ నేతల వ్యాఖ్యలపై కూడా ఇలాంటి చర్యలే తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్
కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది బీజేపీ. కాంగ్రెస్ ప్రతి విషయానికి ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని చెబుతోందని ఆ పార్టీ నేత సంబిత్ పాత్రా విమర్శించారు. "ఓ మహిళ అత్యాచారానికి గురైందని ఓ ఎంపీగా రాహుల్ చెప్పారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే హక్కు పోలీసులకు ఉంది. అందుకే రాహుల్ ఇంటికి వెళ్లి నోటీసు ఇచ్చి.. ఆ మహిళకు సంబంధించిన వివరాలు చెప్పమని అడిగారు." అని సంబిత్ పాత్రా స్పష్టం చేశారు.
ఈనెల 16న నోటీసులు..
భారత్ జోడో యాత్రలో భాగంగా జనవరి 30న శ్రీనగర్‌లో పర్యటించిన రాహుల్.. తన యాత్రలో అనేక మంది మహిళలు తనతో సమావేశమయ్యారని చెప్పారు. ఈ క్రమంలోనే ఇప్పటికీ అత్యాచారాలకు గురవుతున్నట్లు సదరు మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే దిల్లీ పోలీసులు ఆయనకు మార్చి 16న నోటీసులు జారీచేశారు. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా చేసుకుని ఈ నోటీసులు పంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ బాధితుల వివరాల కోసమే రాహుల్ గాంధీని ప్రశ్నించినట్లు పోలీసులు వెల్లడించారు. బాధిత మహిళల వివరాలు అందిస్తే దానికి కారణమైన వారిపై తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు కోరారు.
ఇటీవలే రాహుల్ గాంధీ లండన్‌లో చేసిన వ్యాఖ్యలకు కారణంగా పార్లమెంట్లో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్న సమయంలో.. పోలీసులు ఆయన ఇంటికి చేరుకోవడం ఒక్కసారిగా పార్టీ శ్రేణుల్లో కలకలం రేపింది. లండన్ వేదికగా 'భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది' అని రాహుల్ గాంధీ అన్న వ్యాఖ్యలను బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. దేశ అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాల జోక్యాన్ని రాహుల్ గాంధీ కోరారంటూ.. బీజేపీ నేతలు ఆరోపించారు. అయితే రెండో దశ పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ వ్యాఖ్యలు చర్చకు రావడం వల్ల ఉభయ సభల్లో బీజేపీ, కాంగ్రెస్ సభ్యులకు మధ్య మాటల యుద్ధం చెలరేగింది. దీంతో గత సోమవారం ప్రారంభమైన రెండో దశ బడ్జెట్ సమావేశాలు దాదాపు వారం రోజులుగా వాయిదా పడుతూనే వస్తున్నాయి. బీజేపీ సభ్యులు రాహుల్ వ్యాఖ్యలు లేవనెత్తి క్షమాపణలు చేప్పాలని కోరగా.. ప్రతిపక్షాలు అదానీ వ్యవహారంలో పార్లమెంటరీ కమిటీ జోక్యాన్ని కోరుతున్నాయి. దీంతో ఉభయ సభల్లోనూ వాయిదాల పర్వం కొనసాగుతోంది.