కరోనా వైరస్ నిర్మూలనకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)తో కలిసి భారత్ బయోటెక్ సంస్థ రూపొందిస్తున్న కొవాగ్జిన్ టీకా అనుకున్న సమయానికంటే ముందుగానే అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి తర్వాతే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని తొలుత ఐసీఎంఆర్ అంచనా వేసినప్పటికీ అంతకంటే ముందుగా ఫిబ్రవరిలోనే విడుదలయ్యే అవకాశం ఉందని ఐసీఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్త, కొవిడ్-19 టాస్క్ఫోర్స్ సభ్యుడు రజనీకాంత్ అన్నారు.
ఇప్పటికే రెండు దశల ప్రయోగాలు పూర్తి చేసుకున్న ఈ వ్యాక్సిన్.. మూడో దశ ప్రయోగాలు ఈ నెలలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వార్తా సంస్థతో ఈ విధంగా చెప్పారు రజనీకాంత్.
" వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మూడో దశ ప్రయోగాలు కాక ముందే వ్యాక్సిన్ అందజేసే అంశంపై ఐసీఎంఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఫేజ్-1, ఫేజ్-2 ప్రయోగాల్లోనూ, జంతువులపై జరిపిన ప్రయోగాల్లోనూ వ్యాక్సిన్ సమర్థంగా పనిచేసింది. అయితే, మూడో దశ ఫలితాలు పూర్తి కాకుండా నూరు శాతం కచ్చితంగా పనిచేస్తుందని అప్పుడే చెప్పలేము. అత్యవసర వినియోగంపై ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తోంది."
- రజనీకాంత్, ఐసీఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్త.
గతంలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ సైతం వ్యాక్సిన్ అత్యవసర వినియోగం అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అంశంపై భారత్ బయోటెక్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇదీ చూడండి: 'ఆగస్టు కల్లా 25 కోట్ల మందికి కొవిడ్ టీకా'