Couple Found Died In Dehradun: ఉత్తరాఖండ్.. దెహ్రాదూన్ ఓ ఇంట్లో ఇద్దరు దంపతులు మూడు రోజులుగా విగతజీవులుగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని కుళ్లిపోయిన మృతదేహాల మధ్య సజీవంగా ఉన్న చిన్నారిని చూసి షాక్కు గురయ్యారు. వెంటనే ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అయితే చిన్నారి ఆరోగ్యం మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. మరణించిన వారిని కాసిఫ్, ఆనమ్లుగా పోలీసులు గుర్తించారు. కాగా ఈ ఘటన జూన్ 13వ తేదీన వెలుగుచూసింది.
ఇదీ జరిగింది.. నాగల్ జిల్లా సహరాన్పుర్కు చెందిన కాసిఫ్కు ఆనమ్ రెండో భార్య. వీరిద్దరూ టర్నర్ రోడ్డు C-13లోని సొహైల్ అనే వ్యక్తి ఇంట్లో నాలుగు నెలలుగా అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో జూన్ 9న ఆనమ్.. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. అదే రోజు సాయంత్రం ఆనమ్ ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యింది. నాలుగు రోజుల వ్యవధిలో ఆనమ్, ఆమె భర్త ఇంట్లో విగత జీవులుగా పడి ఉన్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరిది ఆత్మహత్య అయి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు.
కాసిఫ్ మొదటి భార్య నుస్రత్ తెలిపిన వివరాలు.. కాసిఫ్ తనతో జూన్ 10వ తేదీ రాత్రి చివరిసారిగా మాట్లాడాడని.. మరుసటి రోజు సహరాన్పుర్కు వస్తానని చెప్పాడని కాసిఫ్ మొదటి భార్య నుస్రత్ పోలీసులకు తెలిపింది. కాసిఫ్కు చాలా అప్పులు ఉన్నాయని.. ఇటీవల ఓ వ్యక్తి దగ్గర జూన్ 11న రూ.5 లక్షలు అప్పుగా తీసుకున్నాడని చెప్పింది.
"జూన్ 11న సహరాన్పుర్కు వస్తానని చెప్పి రెండు రోజులు గడుస్తున్నా.. ఇంకా ఇంటికి రాకపోవడం వల్ల నేను పలుమార్లు కాసిఫ్కు ఫోన్ చేశాను. ఫోన్ స్విచ్ఛాఫ్ రావడం వల్ల నాకు మరింత భయం వేసింది. దీంతో అతడి కోసం వెతుకుతూ టర్నర్ రోడ్డులోని అతడి ఇంటికి వెళ్లాను. అప్పుడు ఆ ఇళ్లు తాళం వేసి ఉంది. ఇంట్లో నుంచి పిల్లాడి ఏడుపు వినిపించి.. పోలీసులకు సమాచారం ఇచ్చాను. లోపలికి వెళ్లి చూస్తే.. కాసిఫ్, ఆనమ్ విగతజీవులుగా పడి ఉన్నారు."
-- నుస్రత్, కాసిఫ్ మొదటి భార్య..
చిన్నారి ఆరోగ్య పరిస్థితి.. చిన్నారిని ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికి స్పృహలోనే ఉన్నాడని డాక్టర్ ధనంజయ్ ధోవల్ తెలిపారు. అయితే శరీరంపై చాలా పురుగులున్నట్లు చెప్పారు. ప్రస్తుతం చిన్నారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. 'బాలుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. తగినంత బరువు కూడా ఉన్నాడు. ఐసీయూలో మెరుగైన వైద్యం అందిస్తున్నాం. కానీ మూడు రోజుల పాటు తల్లిపాలు కూడా లేకుండా పిల్లవాడు ఆరోగ్యంగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది' అని చిన్నారికి వైద్యం అందిస్తున్న డాక్టర్ ధనుంజయ్ తెలిపారు.
"మృతుడు కాసిఫ్ తన మొదటి భార్యతో ఎప్పుడు గొడవ పడేవాడు. అతడికి చాలా అప్పులు ఉన్నాయి. ఈ కారణంగానే అతడు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని మేము అనుమానిస్తున్నాము. కానీ పూర్తి దర్యాప్తు అనంతరమే మృతికి గల కారణాలు తెలుస్తాయి. కాగా కాసిఫ్ రెండో పెళ్లి చేసుకున్నట్లు నుస్రత్కు తెలియదు. కాసిఫ్కు మొదటి భార్య, ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. నుస్రత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నాం. పూర్తి వివరాలు దర్యాప్తులో తేలనున్నాయి"
--పోలీసులు