Constable Committed Suicide After killing his wife and Two Children: వైఎస్సార్ కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కడప రెండో పట్టణ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు.. తన భార్య, ఇద్దరు పిల్లలను తుపాకితో కాల్చి చంపారు. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో కడప నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
వివరాల్లోకి వెళ్తే.. . కో-ఆపరేటివ్ కాలనీలో నివాసమున్న వెంకటేశ్వర్లు.. కడప రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు రాత్రి విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. మళ్లీ అర్ధరాత్రి 12 గంటలకు సమయంలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన కానిస్టేబుల్.. స్టోర్ రూమ్ లో ఉన్న పిస్తోలు తీసుకుని ఇంటికి వచ్చాడు. ఇంట్లో భార్య, ఇద్దరు కుమార్తెలు నిద్రిస్తున్న సమయంలో ఆ రివాల్వర్‌తో భార్య, ఇద్దరు పిల్లలను కాల్చి చంపారు. అనంతరం తాను కూడా పాయింట్ బ్లాంక్‌లో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు నిర్ధారించారు. పులివెందులకు చెందిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు రెండేళ్ల నుంచి కడప టూ టౌన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, కుటుంబ కలహాలతోనే ఈ ఘటన జరిగిందని కడప డీఎస్పీ షరీఫ్ మీడియా తెలిపారు. వెంకటేశ్వర్లు రెండు భార్య రమాదేవి పేరుతో ఆస్తులు, డాక్యుమెంట్లను రాశాడని.. వాటిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. రెండో భార్య రమాదేవిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. భార్యా పిల్లలకు మత్తుమందు ఇచ్చి కాల్చి చంపాడా.. లేదా.. అనేది పోస్టుమార్టంలో తేలాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు.
ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. వెంకటేశ్వర్లుకు రెండో భార్య ఉందనే విషయం ఆయన కుటుంబ సభ్యులకు తెలుసా.. లేదా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కానిస్టేబుల్ ఇంట్లో లభించిన ప్రామిసరీ నోట్లు రిజిస్టర్ బాండ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను కడప రిమ్స్‌కు తరలించారు. కానిస్టేబుల్ ఇద్దరి కుమార్తెల్లో ఒకరు డిగ్రీ చదువుతుండగా.. మరొకరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు.
చనిపోవడానికి ముందు జిల్లా ఎస్పీ పేరుతో వెంకటేశ్వర్లు ఓ లేఖ రాశారు. తనతోపాటు మొదటి భార్య, పిల్లలు చనిపోయాక ఆస్తి అంతా రెండో భార్యకు దక్కేలా.. జూన్‌లోనే అగ్రిమెంట్ చేయించారు. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ కుటుంబం చనిపోవడంపై అనుమానాలు నెలకొన్నాయి. కాగా.. కానిస్టేబుల్ కుటుంబం చనిపోవడం బాధాకరమని.. ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు అన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి నివాళులు అర్పించారు. హెడ్ కానిస్టేబుల్ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోవడంపై బంధువులు ఆవేదన వ్యక్తంచేశారు.