కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో విద్వేషం పెరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. భాజపా, ఆరెస్సెస్ దేశాన్ని విభజిస్తున్నాయని మండిపడ్డారు. ధరల పెరుగుదల దేశాన్ని నిండా ముంచేస్తోందని ఆరోపించారు. ద్రవ్యోల్బణం వల్ల సాధారణ పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా దిల్లీలోని రాంలీలా మైదానంలో ఏర్పాటు చేసిన భారీ నిరసన కార్యక్రమంలో ప్రసంగించిన రాహుల్.. భాజపా వల్ల ఇద్దరు పారిశ్రామికవేత్తలు మాత్రమే లాభపడుతున్నారని విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా భారత్ జోడో యాత్ర గురించి మాట్లాడిన ఆయన.. దీని ద్వారా ప్రజల్లోకి వెళ్లి నిజాలు చెబుతామని అన్నారు.
"ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, విద్వేషం పెరగడం.. వల్ల దేశం బలహీనంగా మారుతోంది. దేశంలో భయం, విద్వేషం నెలకొనడం వల్ల ఇద్దరు పారిశ్రామికవేత్తలు లాభపడుతున్నారు. వారి ప్రయోజనాల కోసమే భాజపా పనిచేస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన మూడు నల్ల వ్యవసాయ చట్టాలు కూడా రైతుల కోసం కాదు. ఇద్దరు, ముగ్గురు పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కల్పించేందుకే. యువతకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. పార్లమెంట్లో విపక్షాల గొంతుకను మోదీ అణచివేస్తున్నారు. మీడియా, న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం.. ఇలా అన్ని వ్యవస్థలపైనా ప్రభుత్వం దాడులకు పాల్పడుతోంది. మోదీని ఎవరు విమర్శించినా విడిచిపెట్టడం లేదు. నన్ను ఈడీ ముందు 55 గంటలు కూర్చోబెట్టారు. మోదీజీ, నేను మీ ఈడీకి భయపడను."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
'మోదీకి అవి సోదరులు..'
అంతకుముందు పార్టీ ప్రధానకార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి నిరుద్యోగం, ద్రవ్యోల్బణం రెండు సోదరుల్లాంటివని ఎద్దేవా చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఈ ర్యాలీని నిర్వహించడం లేదని జైరాం అన్నారు. ప్రభుత్వం ముందున్న రెండు అతిపెద్ద సవాళ్లను ప్రజలకు గుర్తు చేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మోదీ ప్రభుత్వానికి సందేశం ఇవ్వనున్నామని తెలిపారు.
జమ్మూలో గులాం నబీ ఆజాద్ ర్యాలీ గురించి ప్రస్తావించగా.. తాను కాంగ్రెస్ ర్యాలీ గురించి మాత్రమే మాట్లాడతానని.. భాజపా ర్యాలీ గురించి కాదని వ్యాఖ్యానించారు. పరోక్షంగా ఆజాద్‌ను భాజపా మద్దతుదారుగా అభివర్ణించారు. అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కాంగ్రెస్ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతోందన్న భాజపా ఆరోపణలపై జైరాం స్పందించారు. తాము ఈ ఆందోళనలను దాదాపు ఏడాది నుంచి నిర్వహిస్తున్నామని గుర్తుచేశారు. ఆగస్టు 5న జైపుర్‌లో పెద్దఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించామన్నారు. దాదాపు 70 మంది ఎంపీలను విజయ్‌చౌక్ నుంచి అరెస్టు చేశారని తెలిపారు. పార్లమెంటు బయట, వెలుపల నిరసన వ్యక్తం చేశామన్నారు. వివిధ రాష్ట్రాల్లోనూ ఆందోళనలు నిర్వహించామన్నారు. ఇదే క్రమంలో సెప్టెంబరు 7 నుంచి 'భారత్ జోడో యాత్ర'ను నిర్వహించనున్నట్లు తెలిపారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తరహాలోనే ఈడీ, సీబీఐ కూడా మోదీ ప్రభుత్వానికి రెండు సోదరుల్లాంటివని ఆరోపించారు.