భారత్ పట్ల చైనా వైఖరి.. ఉక్రెయిన్‌తో రష్యా వ్యవహరిస్తున్న విధంగా ఉందని అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. భారత దేశ సరిహద్దుల్ని మార్చేస్తామని ఆ దేశం బెదిరిస్తోందని అన్నారు. భారత్-చైనా సరిహద్దుల్లో వివాదానికి.. దేశంలో నెలకొన్న బలహీన ఆర్థిక పరిస్థితులకు.. దార్శనికత లేమి, విద్వేషం కారణంగా ఏర్పడ్డ గందరగోళానికి సంబంధం ఉందని విశ్లేషించారు. ఇటీవల భారత్ జోడో యాత్రలో భాగంగా దిల్లీలో తనను కలిసిన సినీ నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్‌తో ఈమేరకు జరిపిన సంభాషణను యూట్యూబ్‌లో షేర్ చేశారు రాహుల్.
"పశ్చిమ దేశాలతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోవద్దని.. రష్యా ముందుగానే ఉక్రెయిన్ను హెచ్చరించింది. అలా చేస్తే ఉక్రెయిన్ భౌగోళిక స్వరూపాన్ని మార్చేస్తామని చెప్పింది. ప్రస్తుతానికి భారత దేశానికి కూడా అదే నియమం వర్తిస్తుంది. చైనా మనకు చెబుతున్నది ఏంటంటే.. 'మీరు ఏమి చేసినా జాగ్రత్తగా ఉండండి. లేదంటే మేము మీ భూభాగాన్ని మార్చివేస్తాము. లద్దాఖ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రవేశిస్తాం'. దాన్నిబట్టి, చైనా కూడా భారత్ విషయంలో రష్యాలానే వ్యవహరిస్తోంది" అని రాహుల్ అన్నారు.
"గతంలో పోల్చితే వివాదానికి నిర్వచనం అనేది పూర్తిగా మారింది. ఒక్క సరిహద్దుల్లోనే కాదు.. ప్రతిచోట పోరాడాలని అన్నారు. దేశంలో ప్రజలు సామరస్యంగా ఉండాలి. ఒకరితో ఒకరు పోరాడకూడదు. అందరూ శాంతియుత దేశంపై దృష్టి పెట్టాలి. మన దేశం యుద్ధానికి వెళ్లడం లేదు. ప్రస్తుతం ఏ దేశం కూడా మనపై దాడి చేయలేని స్థితికి చేరుకొంటోంది. కానీ బలహీనమైన ఆర్థిక వ్యవస్థ, దార్శనికత లేమి, ద్వేషంతో దేశం గందరగోళంగా ఉంది. అందుకే చైనా భారత్‌లో ప్రవేశించడానికి ప్రయత్నిస్తోంది. మన దేశం అంతర్గత సామరస్యం లేకుండా గందరగోళంగా ఉందని చైనాకు తెలుసు. అందుకే వారు దేశంలోకి చొచ్చుకొని వచ్చి ఏమైనా చేయగలుగుతున్నారు." అని రాహుల్ అభిప్రాయపడ్డారు.
"ఒక భారతీయుడిగా నేను.. యుద్ధాన్ని ప్రేరేపించే వ్యక్తిగా ఉండకూడదనుకుంటున్నాను. కానీ, సరిహద్దులో నిజమైన సమస్యలు ఉన్నాయి.. అవి మన దేశంలోని పరిస్థితులకు అద్దంపడుతున్నాయి. ప్రభుత్వం వాటిని గుర్తించాలి. మనలో మనమే పోరాడినప్పుడు, ఆర్థిక వ్యవస్థ పనిచేయనప్పుడు, నిరుద్యోగం ఉన్నప్పుడు.. మన ప్రత్యర్థి ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోవచ్చు" అని రాహుల్ గాంధీ కమల్‌తో అన్నారు.
ఇవీ చదవండి: