Chhavi Mushar buxur: పాకిస్థాన్‌లో గత 12 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న బిహార్ వాసి ఛవీ ముషార్ త్వరలో భారత్‌కు తిరిగి రానున్నాడు. బక్సర్ జిల్లాకు చెందిన ఈ యువకుడు 12 సంవత్సరాల క్రితం దారితప్పి పాకిస్థాన్ సరిహద్దులోకి వెళ్లిపోయాడు. దీంతో పాక్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని కరాచీ జైల్లో పెట్టారు. గతేడాది డిసెంబరులో ఛవీ గురించి సమాచారం అందుకున్న భారత విదేశాంగ శాఖ.. స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేసింది.
ఛవీ ముషార్ బతికే ఉన్నాడని తెలియని కుటుంబ సభ్యులు కర్మకాండలు నిర్వహించారు. అయితే.. ఇప్పుడు తమ కుమారుడు బతికే ఉన్నాడు, అతి త్వరలో ఇంటికి రానున్నాడని తెలిసి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు తమ బిడ్డను చూస్తానా అని ఆసక్తిగా ఛవీ ముషార్ తల్లి ఎదురుచూస్తోంది. ఇప్పటికే ఛవీ ముషార్.. పాకిస్థాన్ జైలు నుంచి విడుదలై పంజాబ్‌లోని గురుదాస్‌పుర్ సరిహద్దులో ఉన్నాడు. అతనిని తీసుకురావడానికి బక్సార్ పోలీసు బృందం గురుదాస్‌పుర్‌కు వెళ్లింది. ఛవీ ముషార్ తప్పిపోయినప్పటికే ఆయనకు బిందు అనే మహిళతో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. ఛవీ చనిపోయాడని ఆయన భార్య వేరొకరిని పెళ్లి చేసుకొని అత్త వారింటికి వెళ్లిపోయింది. ప్రస్తుతం వీరి బిడ్డను ఛవీ ముషార్ సోదరుడు పెంచుతున్నాడు.
ఇదీ చదవండి: ఆరేళ్ల బాలుడి బైక్ రేస్... తండ్రిపై పోలీసుల కేసు!