Chandrayaan 3 Madhavan Nair : కేవలం ఒక బాలీవుడ్ సినిమా నిర్మాణానికి అయ్యే ఖర్చుతో ఇస్రో అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త చరిత్ర లిఖించింది. ఇప్పటివరకు ఏ దేశమూ చేరని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి అందరి మన్ననలు అందుకుంది. చంద్రయాన్-3 మిషన్‌ను కేవలం 615 కోట్ల రూపాయలతోనే ఇస్రో చేపట్టింది. ఇతర దేశాల అంతరిక్ష పరిశోధనలతో పోలిస్తే దాదాపు 60 శాతం తక్కువ ఖర్చుతోనే ఇస్రో తన పరిశోధనలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఇస్రో మాజీ ఛైర్మన్, చంద్రయాన్-1 మిషన్‌కు నేతృత్వం వహించిన మాధవన్ నాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇస్రో శాస్త్రవేత్తల్లో మిలియనీర్లు ఎవరూ లేరన్న ఆయన ఇతర దేశాల అంతరిక్ష సంస్థల శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఇతర సిబ్బందితో పోలిస్తే ఇస్రో శాస్త్రవేత్తలకు జీతాలు ఐదో వంతు మాత్రమే ఉంటాయన్నారు. అంతరిక్ష పరిశోధనలను తక్కువ ఖర్చుతోనే ఇస్రో శాస్త్రవేత్తలు చేయడానికి ఇది కూడా ఒక కారణమని తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలంతా సాధారణ జీవితం గడిపేవారేనని వివరించారు. వారు డబ్బు కోసం ఆలోచించరని మిషన్ పట్ల అంకిత భావం, మక్కువతో పని చేస్తారని తెలిపారు. అందుకే ఇస్రో శాస్త్రవేత్తలు అత్యున్నత శిఖరాలకు చేరుకున్నట్లు వెల్లడించారు.
Chandrayaan 3 Budget In Crores : సరైన ప్రణాళిక, దీర్ఘకాల విజన్‌తోనే ఇస్రోకు గొప్ప విజయాలు సాధ్యం అవుతున్నాయని మాధవన్ నాయర్ వివరించారు. అంతరిక్ష పరిశోధనలకు స్వదేశీ పరిజ్ఞానం ఉపయోగించడం వల్ల తక్కువ ఖర్చుతోనే ఇస్రో అంతరిక్ష పరిశోధనల్లో అద్భుత విజయాలు సాధించినట్లు తెలిపారు. చంద్రయాన్-3 విజయంతో గ్రహాన్వేషణల్లో భారత్‌కు గొప్ప ముందడుగు పడినట్లు వెల్లడించారు. ఇప్పటికే అమెరికా, ఐరోపాతో భారత్ అంతరిక్ష రంగంలో పలు వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. చంద్రయాన్-3తో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు భారత అంతరిక్ష రంగంలోకి రానున్నాయి.
'చంద్రయాన్-2 ప్రయోగం సక్సెస్ కాకపోవడం వల్ల శాస్త్రవేత్తలు మరింత అప్రమత్తమై పనిచేశారు. అందుకే చంద్రయాన్-3 ప్రయోగం విజయం సాధించింది. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమవుతుందని అందరం ముందే విశ్వసించాం.' అని ఇస్రో మాజీ ఛైర్మన్ మాధవన్ నాయర్ అన్నారు.
Chandrayaan 3 Google Doodle : యానిమేటెడ్ డూడుల్‌తో చంద్రయాన్-3 విజయాన్ని గూగుల్ జరుపుకుంది. చంద్రయాన్-3ని విజయవంతంగా ల్యాండింగ్ చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను గూగుల్ అభినందించింది. చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3 ల్యాండింగ్‌ను పురస్కరించుకుని గూగుల్ డూడుల్‌ను విడుదల చేసింది.
PM Modi ISRO Visit : 'చంద్రయాన్-3' శాస్త్రవేత్తలను అభినందించనున్న ప్రధాని.. శనివారం ఇస్రో పర్యటన!
ల్యాండర్ నుంచి బయటకొచ్చిన రోవర్.. జాబిల్లిపై అసలు పని షురూ! కొత్త ఫొటోలు చూశారా?