భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 తొలిదశ విజయవంతం కావటం వల్ల శాస్తవేత్తల్లో సంతోషం వ్యక్తమైంది. ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్‌ను మోసుకుని అత్యంత శక్తిమంతమైన ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి ఎగిరింది. సకాలంలో పేలోడ్‌ను మండించి తొలి రెండు దశలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. చంద్రుడి దిశగా వెళ్లేందుకు మధ్యాహ్నం 2.42 గంటలకు మూడోదశ పేలోడ్‌ను మండించారు. మూడు దశలు నిర్ణీత ప్రణాళిక ప్రకారం పూర్తయ్యాయి. స్పేస్‌క్రాఫ్ట్‌ను అవసరమైన ఎత్తుకు చేర్చేందుకు 3దశలను విజయవంతంగా పూర్తి చేసుకొంది. మధ్యాహ్నం 2.54 గంటలకు మూడో దశ ముగిసిందని, జాబిల్లి దిశగా ప్రయాణం మొదలైనట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు.
"భారత్‌కు కృతజ్ఞతలు. చంద్రుని దిశగా చంద్రయాన్-3 ప్రయాణం మొదలైంది. ఎల్‌విఎం3-ఎం4 రాకెట్ చంద్రయాన్-3 క్రాఫ్ట్‌ను భూమి చుట్టు ఉన్న కక్ష్యలోకి తీసుకెళ్లింది. 170/36,500 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి చేరింది. చంద్రయాన్-3 రాబోయే రోజుల్లో కక్ష్యలో అవసరమైన ప్రక్రియ పూర్తిచేసుకొని గమ్యం దిశగా ప్రయాణించాలని కోరుకుందాం. చంద్రయాన్-3 చంద్రుని దిశగా మరింత ముందుకు సాగాలని ఆశిద్దాం. ఆగస్టు 23న సా. 5.47కు సాఫ్ట్‌ల్యాండింగ్ జరగనుంది"
--ఎస్.సోమ్‌నాథ్ ఇస్రో ఛైర్మన్
చంద్రయాన్-3 నిర్దేశిత కక్ష్యలోకి చేరటానికి ముందు మూడు దశలు విజయవంతం కావటం వల్ల ఇస్రో శాస్త్రవేత్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తమ స్థానాల నుంచి లేచి నిలబడి కరతాళధ్వనులు చేశారు. ఒకరికొకరు కరచాలనం చేసుకున్నారు. ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్.. కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌కు చంద్రయాన్-3 రాకెట్ నమూనాను బహూకరించారు. ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్‌ను పలువురు సీనియర్ శాస్త్రవేత్తలు, మాజీ ఇస్రో ఛైర్మన్లు అభినందించారు.
చంద్రయాన్ 3 విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. చంద్రయాన్ 3.. భారత అంతరిక్ష రంగంలో నూతన అధ్యాయాన్ని లిఖించిందని పేర్కొన్నారు. చంద్రయాన్ 3 ప్రతీ భారతీయుడి కలలను, ఆశయాలను ఉన్నతంగా ఎగరవేస్తుందనివివరించారు. ఈ మహత్తర విజయం.. భారత శాస్త్రవేత్తల నిర్విరామ అంకితభావానికి నిదర్శనమని ప్రధాని అన్నారు. ఇస్రో శాస్త్రవేత్తల స్ఫూర్తికి, చాతుర్యానికి వందనం చేస్తున్నానంటూ మోదీ ట్విటర్‌లో అభినందనలు తెలియజేశారు.
చంద్రయాన్-3 విజయవంతంగా ప్రయోగించిన భారత్.. అంతరిక్ష పరిశోధనలో మరో కీలక మైలురాయిని చేరిందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ కీలక విజయం కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి హృదయ పూర్వకంగా అభినందనలు తెలియచేస్తున్నానని ట్వీట్ చేశారు.