Chandrababu Health Condition in Rajamahendravaram Jail: మాజీ సీఎం చంద్రబాబు చర్మసంబంధ సమస్యతో బాధపడుతున్నారని, వెంటనే కారాగారంలో ఆయనకు శీతల వాతావరణం కల్పించాలని జైలు అధికారులకు సూచించినట్లు రాజమండ్రి జీజీహెచ్ జనరల్ సర్జరీ అసోసియేట్ ప్రొఫెసర్ శివకుమార్ చెప్పారు. జైలు అధికారుల సూచనల మేరకు వివిధ విభాగాలకు చెందిన అయిదుగురు వైద్యుల బృందం శనివారం సాయంత్రం జైల్లో చంద్రబాబుకు పూర్తి ఆరోగ్య పరీక్షలు నిర్వహించిందన్నారు.
చంద్రబాబుకు రక్తపరీక్షలు చేశామని, మధుమేహం, బీపీ, ఇతర పరీక్ష ఫలితాలన్నీ సాధారణంగానే ఉన్నాయన్నారు. వైద్య పరీక్షల అనంతరం కారాగారం ఆవరణలోనే జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీశ్‌తో కలిసి వైద్యులు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, నీరసంగా కనిపించలేదన్నారు. తాము అడిగిన ప్రతి అంశానికీ సమాధానం చెప్పారని వివరించారు. ఆయనకు చర్మ సంబంధ సమస్యలున్నాయన్నారు. పరీక్షల అనంతరం ఓ నివేదికను జైలు అధికారులకు నివేదించామన్నారు.
ఇప్పటివరకు వాడుతున్న మందుల వివరాలు తీసుకున్నామని.. ప్రస్తుతం తీసుకోవాల్సిన మందుల గురించి సూచించగా..తన వ్యక్తిగత వైద్యులను సంప్రదించిన తరువాత, వారి సలహా మేరకు తీసుకుంటామని చంద్రబాబు చెప్పారని డాక్టర్ శివకుమార్ చెప్పారు. డీహైడ్రేషన్ వల్ల గుండె, ఇతర అవయవాలపై ప్రభావం చూపుతుందని కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారని ప్రస్తావించగా.. ప్రస్తుత వాతావరణం వల్ల డీహైడ్రేషన్ సమస్య అందరికీ ఉంటుందని, అందుకే శీతల వాతావరణం కల్పించాలని జైలు అధికారులకు సూచించినట్లు చెప్పారు.
ఆ సదుపాయం కల్పించపోతే దురద పెరిగే అవకాశం ఉందన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉన్నందున ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం లేదన్నారు. వైద్యబృందం 24 గంటలపాటు అందుబాటులో ఉంటుందన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వైద్యనిపుణులు ఇచ్చిన సమగ్ర రిపోర్టును న్యాయస్థానం, ఉన్నతాధికారుల దృష్టికి తక్షణమే తీసుకెళ్తామని డీఐజీ రవికిరణ్ చెప్పారు.
ఈనెల 12న రాజమహేంద్రవరం జీజీహెచ్ చర్మ వైద్య నిపుణులు డాక్టర్ జి.సూర్యనారాయణ, డాక్టర్ సిహెచ్.వి.సునీత జైల్లో చంద్రబాబును పరీక్షించి 13న నివేదిక అందజేశారు. ఆ వివరాలు శనివారం బయటకు రావడంతో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని స్పష్టమవుతోంది. చంద్రబాబు వీపు, నడుము, ఛాతీ, చేతులు, గడ్డం తదితర ప్రాంతాల్లో ఎర్రటి దద్దుర్లు, పొక్కులు ఏర్పడ్డాయని వైద్యులు జైలు ఉన్నతాధికారులకు సమర్పించిన నివేదికలో వెల్లడించారు.
దీనివల్ల తీవ్రమైన దురద ఏర్పడిందని తెలిపారు. ఛాతీ, వీపు, పొట్ట, నడుము భాగాల్లో ఎర్రటి దట్టమైన దద్దుర్లు, పొక్కులు, గెడ్డంపై ఎర్రటి దద్దుర్లు గమనించామని.. రెండు అరచేతుల్లో చీము పొక్కులు చితికిపోవడం వల్ల దురద, శరీరమంతా తెల్లటి పొక్కులు, కొన్ని ప్రాంతాల్లో వేడి కురుపుల వల్ల ఇబ్బంది పడుతున్నారని వైద్యులు చెప్పారు.
శరీరానికి రోజుకు రెండుసార్లు లోషన్, రెండు అరచేతులకు ఆయింట్‌మెంట్, జెల్ రాసుకోవాలని.. అలర్జీ, దురద తగ్గేందుకు రోజుకు ఒక మాత్ర, విటమిన్-సి పెరుగుదలకు మరో మాత్ర వేసుకోవాలని చంద్రబాబుకు వైద్యులు సూచించారు. దద్దుర్లు, పొక్కులు శరీరమంతా అధికంగా వ్యాపించకుండా, కొత్త సమస్యలు రాకుండా ఉండాలంటే ఆయన్ను శీతల వాతావరణంలో ఉంచాలని స్పష్టం చేశారు.