Chandrababu Bail Petition in ACB Court: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ ఛైర్మన్ ఇచ్చిన ఫిర్యాదులో తన పేరు ప్రస్తావనే లేదని పిటిషన్‌లో తెలిపారు. కేసు నమోదుకు కారణమైన రిపోర్టులో తనపై ఆరోపణలే లేవన్నారు.
ప్రస్తుత కేసులో (Skill Development Case) తన పేరు ఎప్పుడు చేర్చారో కనీస వివరాలు వెల్లడించలేదని.. ఎఫ్‌ఐఆర్‌లో పేరు చేర్చిన విషయాన్ని అనిశా కోర్టుకు ఎప్పుడు సమాచారం ఇచ్చారో కూడా దర్యాప్తు సంస్థ వెల్లడించలేదన్నారు. ఏ ఆధారాలతో ఈ కేసులో నిందితుడిగా చేర్చారో చెప్పేందుకు సీఐడీ వద్ద ప్రాథమిక వివరాలు లేవన్నారు. రాజకీయ ప్రతీకారంతో ఈ కేసులోకి లాగారని.. పిటిషన్‌లో పేర్కొన్నారు.
Mulakhat with Chandrababu: చంద్రబాబుతో పూర్తయిన ములాఖత్.. పొత్తులపై పవన్ కీలక వ్యాఖ్యలు
దురుద్దేశంతోనే అరెస్టు చేశారు: కేసు నమోదు చేసిన 22 నెలల తర్వాత తనపై ఆరోపణలను తెరపైకి తెచ్చారని.. రిమాండ్ రిపోర్ట్ పరిశీలిస్తే.. వాంగ్మూలాలన్నీ 2022కి ముందు సేకరించినవేనని పిటిషన్‌లో తెలిపారు. 2022 నుంచి ఆ వివరాలన్ని సీఐడీ వద్ద ఉన్నాయన్నారు. అదనపు సాక్ష్యాధారాలు లేకుండా దురుద్దేశంతో రాత్రికిరాత్రి అరెస్ట్ చేశారని తెలిపారు. ఈ కేసు దర్యాప్తును 2021 డిసెంబర్ నుంచి దర్యాప్తు సంస్థ విచారణ చేస్తోందని సుమారు 141 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసిందన్నారు. రిమాండ్ రిపోర్టు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలిస్తే.. నైపుణ్యాభివృద్ధి సంస్థ వ్యవహారంలో వారిని సంప్రదించి తాను ప్రభావితం చేశానని ఒక్కరు చెప్పలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.
బెయిలు మంజూరు చేయడానికి ఈ ఒక్క కారణం సరిపోతుంది: తనపై చేసిన ఆరోపణలను నిరూపించేందుకు ప్రాథమిక సాక్ష్యాధారాలను సైతం దర్యాప్తు సంస్థ సేకరించలేకపోయిందని తెలిపారు. రాజకీయ ప్రతీకారం తీర్చుకోవాలన్న దురుద్దేశంతో సీఎం ప్రోద్భలంతో ఈ కేసులోకి లాగారని పిటిషన్‌లో వివరించారు. అనినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ ఆమోదం లేకుండా తన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడం, దర్యాప్తు చేయడం, అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని.. బెయిలు మంజూరు చేయడానికి ఈ ఒక్క కారణం సరిపోతుందని పిటిషన్‌లో తెలిపారు.
దర్యాప్తు సంస్థ కోర్టును సంతృప్తిపరచలేకపోయింది: ఇదే కేసులో నిందితులుగా ఉన్నవారందరూ న్యాయస్థానం ద్వారా ఇప్పటికే సాధారణ, ముందస్తు బెయిళ్లు పొందారన్నారు. ఇతర నిందితులు వేసిన బెయిలు పిటిషన్ విచారణ సందర్భంగా ఏపీఎస్‌ఎస్‌డీసీకి ఆర్థికంగా నష్టం జరిగినట్లు దర్యాప్తు సంస్థ ఎలాంటి ఆధారాలను చూపించలేదని హైకోర్టు అభిప్రాయపడిందన్నారు. త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం ఏపీఎస్‌ఎస్‌డీసీకి అందాల్సిన సేవల విషయంలో.. లోటుపాట్లు జరిగాయని దర్యాప్తు సంస్థ కోర్టును సంతృప్తిపరచలేకపోయిందని చెప్పారు.
అన్యాయాలను ప్రశ్నిస్తున్నందుకే ఇరికించారు: అంతేకాక నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా 2లక్షల13వేల మంది విద్యార్థులు విజయవంతంగా శిక్షణ పొందారని.. 40 కళాశాలల్లో నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే ఆడిట్ నివేదిక ఇచ్చారని.. దాని ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం చెల్లదని పిటిషన్‌లో వెల్లడించారు. ప్రతిపక్ష నేతగా ప్రజాసమస్యలపై పోరాడుతున్నానని..అనినీతి, ప్రజాధనం దుర్వినియోగం, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ, మహిళల విషయంలో అధికారపార్టీ చేస్తున్న అక్రమ, అన్యాయాలను ప్రశ్నిస్తున్నందుకు తనను ఈ కేసులో ఇరికించారన్నారు.
అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నారు: ప్రాణాలకు ముప్పుపొంచి ఉన్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం జడ్ ప్లస్ భద్రత కల్పించిందని తెలిపారు. 2002లో తీవ్రవాదుల దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డానని.. రాజకీయ ప్రత్యర్థులు తనను అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కారాగారంలో ఉంచడం ద్వారా.. జడ్ ప్లస్ సెక్యూర్టీకి దూరంగా ఉంచాలని, తద్వారా ప్రత్యర్థులు లక్ష్యాన్ని సులువుగా సాధించేలా అధికార పార్టీ, ముఖ్యంగా అధికార పార్టీ పెద్ద చూస్తున్నట్లు తెలిసిందని పిటీషన్‌లో వివరించారు.
ప్రస్తుతం తన వయసు 73 ఏళ్లని.. రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్నానని తెలిపారు. వయసు, పూర్వ వైద్య చరిత్ర, అరెస్టు సందర్భంగా అధికారులు వ్యవహరించిన తీరును పరిగణనలోకి తీసుకొని బెయిలు మంజూరు చేయాలని కోరారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13, ఐపీసీ సెక్షన్ 409 తప్ప మిగిలిన సెక్షన్లన్ని ఏడేళ్లలోపు జైలు శిక్షకు వీలున్నవి మాత్రమేనని పిటీషన్‌లో తెలిపారు. అవినీతి నిరోధచట్టం సెక్షన్ 13, ఐపీసీ 409 ప్రకారం నేరానికి పాల్పడినట్లు తనపై నిర్దిష్ట ఆరోపణలు లేవన్నారు. పబ్లిక్ సర్వెంట్ ఆధీనంలో ఉన్న సొమ్ము దుర్వినియోగం చేసినప్పుడే సెక్షన్ 409 వర్తిస్తుందన్నారు.
Chandrababu Bail Petition : అంగళ్లు ఘటన.. చంద్రబాబు పిటిషన్‌పై విచారణ ఈనెల 20కి వాయిదా
కనీస ఆధారాలు లేవు: ప్రస్తుత కేసులో తన ఆధీనంలో ఎలాంటి సొమ్ము లేనందున దానిని వేరే వారికి మళ్లించే ప్రశ్నే ఉత్పన్నం కాదని.. ఐపీసీ సెక్షన్ 420 వర్తింపచేయడానికి వీల్లేదన్నారు. కుట్రపూరిత ఒప్పందం చేసుకున్నట్లు కనీస ఆధారాలు లేవని అన్నారు. అలాంటప్పుడు సెక్షన్ 120బీ నమోదు చెల్లదన్నారు. అనినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1)(సీ),(డీ) ప్రకారం నేరపూర్వక దుష్ప్రవర్తను పాల్పడినట్లు తనపై ఆరోపణలు లేవని.. ఆ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చెల్లుబాటుకాదని తెలిపారు.
అరెస్టైన వ్యక్తి ఆరోగ్యం, భద్రతను కాపాడేందుకు సీఆర్‌పీసీ సెక్షన్ 55A వీలుకల్పిస్తోందన్నారు. తప్పుడు కేసులో ఇరికించినప్పటికీ దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్షులను ప్రభావితం చేస్తాననేందుకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉన్నానని సీఐడీ చేస్తున్న ఆరోపణల కారణంగా బెయిలు నిరాకరించడానికి వీల్లేదన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని రెగ్యులర్ బెయిలు మంజూరు చేయాలని.. ప్రధాన బెయిలు పిటిషన్ తేల్చే వరకు మధ్యంతర బెయిలు ఇవ్వాలని పిటిషన్‌లో చంద్రబాబు కోరారు.