GALI JANARDHANA REDDY: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి వివిధ దేశాలలో పెట్టుబడులు పెట్టారని వచ్చిన ఆరోపణల నిగ్గు తేల్చేందుకు సహకరించాలని 4 దేశాలకు చెందిన దర్యాప్తు సంస్థలను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కోరింది. సింగపూర్, స్విట్జర్లాండ్, యూఏఈ, ఐల్ ఆఫ్ మ్యాన్ (ఐర్లాండ్-ఇంగ్లాండ్ మధ్యలో ఉన్న చిన్న దేశం)లలోని న్యాయశాఖ అధికారులకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయయూర్తి జస్టిస్ ఇ. ఇంద్రకళ తాజాగా లేఖలు రాశారు.
జీఎల్ఏ (గాలి జనార్దనరెడ్డి) ట్రేడింగ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఆయా దేశాలలో పెట్టిన పెట్టుబడులు, కంపెనీ, కంపెనీ తరఫున సంతకాలు చేసిన వారు, బ్యాంకు ఖాతాల వివరాలు, తదుపరి లబ్ధిదారులు, కంపెనీల షేర్ల వివరాలు, వాటిని కొన్న వారు, కంపెనీలలో డైరెక్టర్లు, వాటా దారులు తదితర వివరాలను అందించాలని ఆయా దేశాల ప్రతినిధులకు రాసిన లేఖలో న్యాయమూర్తి కోరారు. 2009-2010 మధ్య 8 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణ కొనసాగుతోంది.
ఎగుమతుల ద్వారా వచ్చిన నగదును.. గాలి జనార్దనరెడ్డి ఆయా దేశాలలోని తన బ్యాంకు ఖాతాలలో జమ చేసుకున్నారని సీబీఐ అనుమానిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలలో ఆయనకు ఉన్న ఆస్తులను జప్తు చేసుకునే ప్రక్రియను సీబీఐ దాదాపు పూర్తి చేసింది. ఆయన పేరిట మిగిలిన ఆస్తులను జప్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే సీబీఐకి అనుమతిని ఇచ్చింది. గాలి కేసులో 2013లోనే సీబీఐ తన అభియోగ పత్రాన్ని న్యాయస్థానంలో దాఖలు చేసింది. కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సీబీఐ ఈ చర్యలు చేపట్టింది.
2009లో గాలి అరెస్టు: మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డిపై గనుల అక్రమ తవ్వకాల కుంభకోణంలో ఆయనతో పాటు 9 మందిపై 2009లో సీబీఐ కేసులు నమోదు చేసింది. 2011వ సంవత్సరం సెప్టెంబరులో జనార్దన్‌రెడ్డిని అరెస్టు చేసి జైల్లో వేశారు. నాలుగేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన గాలికి.. 2015 జనవరి 20న సుప్రీంకోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిలును మంజూరు చేసింది. కోర్టు ఆదేశాలను పాటిస్తున్నందున బెయిలు షరతులను సడలించాలంటూ 2020లో గాలి మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పుడు విచారించిన న్యాయస్థానం.. ఆయా జిల్లాల ఎస్పీలకు తెలియజేసి కడప, బళ్లారి, అనంతపురం వెళ్లవచ్చంటూ ఆదేశాలిచ్చింది.
గాలి కొత్త పార్టీ: గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకూ బీజేపీలో కొనసాగిన ఆయన.. సొంత పార్టీని స్థాపించారు. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో 2022 డిసెంబర్ 25న రాజకీయ పార్టీని ప్రకటించారు.
ఇవీ చదవండి: