ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ పెళ్లిలో వధువుకు గుండెపోటు రావడం వల్ల అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో పెళ్లింట విషాదం అలుముకుంది. పెళ్లి జరుగుతుందని ఆనందంలో ఉండగా ఒక్కసారిగా.. వధువు మృతి చెందడం వల్ల కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. దీంతో అప్పటివరకు ఉన్న ఆనందమంతా ఆవిరైపోయింది.
లఖ్‌నవూ జిల్లా మలిహాబాద్ ప్రాంతంలో బడ్వానా గ్రామంలో రాజ్‌పాల్ అనే వ్యక్తి కుమారై శివంగికి వివాహం జరిగింది. పెళ్లి అనంతరం వధువరులు కలిసి ఊరేగింపుగా బయలుదేరారు. ఈ తంతులో అందరూ ఆనందంతో నృత్యాలు చేశారు. ఊరేగింపు ముగిసిన తర్వాత.. వధూవరులు పెళ్లిమండపంలో దండలు మార్చుకున్నారు. అదే సమయంలో పెళ్లి కూతురు ఒక్కసారిగా కిందపడిపోయింది. దీంతో హుటాహుటిన శివంగిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వధువు మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. వధువు మృతి చెందిన వార్త బంధువులకు తెలియడం వల్ల.. ఒక్కసారిగా మండపంలో విషాదం నెలకొంది. దీంతో పెళ్లిమండపంలో అందరూ ఆమెకు సంతాపం తెలిపారు. పెళ్లికి 20 రోజుల ముందు నుంచే శివంగికి ఆరోగ్యం సరిగా లేదని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో ఊరేగింపు అనంతరం శివంగికి గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు వెల్లడించారు.