యూపీలోని ఆగ్రా-దిల్లీ హైవేపై ఘోర ప్రమాదం జరిగి ఓ యువకుడు మరణించగా.. అనేక వాహనాలు మృతదేహంపై నుంచే ప్రయాణించాయి.
ఆదివారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొనగా అతడు మృతి చెందాడు. పొగమంచు కారణంగా వాహనదారులకు మృతదేహం కనిపించలేదు. ఫలితంగా రాత్రంతా ఆ శవం టైర్ల కింద నలిగి నుజ్జునుజ్జు అయింది. దాదాపు 100 మీటర్ల పాటు చిన్నచిన్న ముక్కలుగా చెల్లాచెదురుగా మారిందని పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
యూపీలోని కీతం శూర్సరోవర్ ప్రాంతంలో మధ్యప్రదేశ్‌కు చెందిన గోవింద్ నగర్ నివాసి గంగా చరణ్ నర్వారియా అనే 30 ఏళ్ల యువకుడిని.. ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో చరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అధిక పొగమంచు కారణంగా ఆ ప్రమాదాన్ని ఎవరూ గుర్తించలేదు. మృతదేహాన్ని గమనించని వాహనదారులు దానిపై నుంచి ప్రయాణించారు. దీంతో టైర్ల నలిగిన శరీరం హైవేపై.. దాదాపుగా 100 మీటర్ల వరకు చెల్లాచెదురైంది.
సోమవారం ఉదయం కాస్త పొగ మంచు తగ్గగా.. సమీపంలోని దాబాకు వచ్చిన ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ దొరికిన ఆధారాల ప్రకారం.. మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. చెల్లాచెదురైన శరీర భాగాలను పోలీసులు గడ్డపార సహాయంతో సేకరించి శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
భార్యను రేప్ చేసి.. ఇంటి నుంచి గెంటేసిన డాక్టర్..
మహారాష్ట్రలో ఓ డాక్టర్ తన భార్యను రేప్ చేసి.. ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. బీడ్ జిల్లా పర్లీ ప్రాంతానికి చెందిన బాధిత మహిళ ఆమె భర్త,కుటుంబసభ్యులపై లైంగిక వేధింపుల కింద కేసు నమోదు చేసింది. గత కొన్నిరోజులుగా తన భర్త తనపై అసహజ లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో వారిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని.. త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.
దుండగుల దాడిలో మృతి చెందిన 5 నెలల చిన్నారి
బిహార్‌లో కొందరు దుండగులు పాత కక్షల కారణంగా రెచ్చిపోయారు. బలిరామ్ పాశ్వాన్ అనే వ్యక్తి కుటుంబంపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 5నెలల చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం అందుకొన్న పోలీసుల వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికే దుండగులు గ్రామాన్ని విడిచి పారిపోయినట్లు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు త్వరలోనే నిందితులను పట్టుకుంటామని వెల్లడించారు.
పాత కక్షల కారణంగా హెడ్ మాస్టర్ హత్య
ఛత్తీస్‌గఢ్‌లో ఓ హెడ్మాస్టర్ను అతికిరాతకంగా హత్య చేశారు. అనంతరం నిందితులు మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టారు. మొదటి మిస్సింగ్ కేసుగా భావించిన పోలీసులు దర్యాప్తు అనంతరం దాన్ని హత్యగా తేల్చారు. నిందితుల్లో ఒకరికి గతంలో నేరచరిత్ర ఉందని పోలీసులు గుర్తించారు. పాత కక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
అసలు ఏం జరిగిందంటే..?
బలోదాబజార్‌లోని కస్డోల్ ప్రాంతానికి చెందిన శాంతిలాల్ పటేల్.. కర్దాస్ ప్రైమరీ స్కూల్లో హెడ్మాస్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే డిసెంబర్ 28 ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన శాంతిలాల్ కనిపించకుండా పోయాడని అతని భార్య సవితా పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దాన్ని మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అదే రోజు సంజయ్ శ్రీవాస్, సృజన్‌లతో శాంతిలాల్ కనిపించినట్లు గుర్తించారు.
వారిని అదుపులోకి తీసుకొని విచారించగా తామే శాంతిలాల్‌ను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. హత్య చేసిన అనంతరం దాన్ని అటవీ ప్రాంతంలో పూడ్చినట్లు వెల్లడించారు. నిందితులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహం త్వరగా పాడవ్వడానికి నిందితులు శవంపై 10కిలోల ఉప్పు చల్లారు.
గతంలో నిందితులకు మృతుడికి మధ్య కొన్ని నగదు లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దాని కారణంగానే ఆ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితులు హత్య చేసిన అనంతరం మృతుడి సెల్‌ఫోన్‌ను దగ్గర్లోని ఓ నదిలో పడేశారు.
న్యూ ఇయర్ వేడుకల్లో వివాదం.. స్నేహితుడిపై గన్‌తో కాల్పులు
బిహార్‌లో ఓ యువకుడ్ని అతడి స్నేహితుడే కాల్చి చంపాడు. వైశాలి ప్రాంతంలో శనివారం రాత్రి న్యూ ఇయర్ వేడుకలు ముగిసిన త్వరాత.. ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్పూర్ గ్రామానికి చెందిన శుభం ఝా అనే యువకుడికి.. అతడి స్నేహితులు మధ్య వివాదం తలెత్తెంది. ఆ వివాదంలో శుభంను ఓ మిత్రుడు గన్‌తో కాల్చి చంపాడు. ఛాతి భాగంలో బుల్లెట్ దిగి శుభం మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.