కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం విధించిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు బంగాల్ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితిని తెలుసుకునేందుకు నియమించిన కేంద్ర బృందాలకు తాము సహకరిస్తున్నట్లు పేర్కొంది.
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతిపై అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందాలకు మమతా బెనర్జీ సర్కార్ అడ్డుపడిందని కేంద్రం ఆరోపించిన కొద్ది గంటలకే బంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరణ ఇచ్చారు. కేంద్రం ఆరోపణల్లో నిజం లేదని ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు లేఖ రాశారు.
"విపత్తు నిర్వహణ చట్టం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జారీ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇస్తున్నాం."
- రాజీవ సిన్హా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, బంగాల్
రాష్ట్రంలో సందర్శించే రెండు బృందాలకు బంగాల్ ప్రభుత్వం సహకరిస్తుందని సీఎస్ హామీ ఇవ్వడాన్ని హోం మంత్రిత్వ శాఖ స్వాగతించింది.