ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 979 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా కరోనాతో 25 మంది మృతి చెందారని పేర్కొంది. 24 గంటల్లో 6 రాష్ట్రాల్లో కొత్తగా 106 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలిందని వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో 6 రాష్ట్రాల్లో ఆరుగురు మృతిచెందారని స్పష్టం చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.
గూడ్స్ ద్వారా ఆహార ధాన్యాలు, చక్కెర, ఉప్పు, బొగ్గు, పెట్రోలియం సరఫరా చేస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వివరించింది. గత 5 రోజుల్లో 1.25 లక్షల వ్యాగన్ల ద్వారా నిత్యావసరాలను సరఫరా చేసినట్టు పేర్కొంది.
"కరోనా నివారణ చర్యలపై మార్గదర్శకాలకు 10 బృందాలు ఉన్నాయి. ఈ బృందాలు.. వైద్య అత్యవసర సేవలు, ఐసోలేషన్ వార్డులు వంటి వాటిపై మార్గదర్శకంగా వ్యవహరిస్తాయి. అయితే ఇప్పటివరకు 34,931 మంది అనుమానితుల నమూనాలను పరీక్షించాం. కేసులు పెరుగుతున్న తరుణంలో.. దేశవ్యాప్తంగా పరీక్షా ల్యాబ్‌లనూ పెంచుతున్నాం. 113 ల్యాబ్‌లకు అదనంగా మరో 47 ప్రైవేటు ల్యాబ్‌లకు అనుమతిచ్చాం."
-కేంద్ర ఆరోగ్యశాఖ
కరోనా వైరస్‌తో మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలిస్తోంది ప్రభుత్వం. ఈ మేరకు ఓ టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నెంబర్(08046110007)ను ఏర్పాటు చేసినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది.
వేతనాలు చెల్లించాల్సిందే...
లాక్డౌన్లో ఉన్నప్పటికీ సంస్థలు.. తమ ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించాల్సిందేనని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అదే సమయంలో ఉద్యోగులను ఇళ్లు ఖాళీ చేయించకూడదని యజమానులకు తేల్చిచెప్పింది. ప్రభుత్వ హెచ్చరికలను పట్టించుకోకపోతే.. కఠిన చర్యలు తప్పవని పేర్కొంది.
ఇదీ చూడండి:- పీఎం కేర్స్‌కు విరాళాల వెల్లువ- రైల్వే రూ.151కోట్లు