సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయిన దృశ్యమిది. చనిపోయిన భార్య ప్రతిరూపాన్ని చేయించి, గృహ ప్రవేశ వేడుక జరిపిన కర్ణాటక కొప్పల్‌కు చెందిన వ్యాపారి శ్రీనివాస గుప్తాను గురించి యావద్దేశం మాట్లాడుకుంది. భార్య పట్ల ఆయనకున్న ప్రేమతోపాటు ఆ విగ్రహాన్ని సహజసిద్ధంగా ఎలా చేశారన్న విషయం గురించి చర్చించుకుంది. ఈ బొమ్మను విదేశాల్లో తయారు చేయించారంటూ తొలుత వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వివరణ ఇచ్చారు శ్రీనివాస గుప్తా. ఈ ప్రతిమను బెంగళూరుకు చెందిన ప్రముఖ కళాకారుడు శ్రీధర్ మూర్తి రూపొందించినట్లు వెల్లడించారు. ఆయన 22 ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉన్నట్లు తెలిపారు.
శ్రీధర్ మూర్తి.. నాగసంద్ర ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆయన కుటుంబం ఎన్నో ఏళ్ల నుంచి ఇదే వృత్తిలో స్థిరపడింది. శ్రీధర్ తండ్రి పేరు కాశీనాథ్. ఆయన జకనాచారి అవార్డు వంటి అనేక రాష్ట్ర పురస్కారాలు అందుకున్నారు. డిగ్రీ పట్టా పొందిన మూర్తి.. అనంతరం తండ్రి వృత్తిని వారసత్వంగా కొనసాగుతున్నారు. గత 22 ఏళ్లుగా అనేక విగ్రహాలు చెక్కారు. 2017లో సొంతంగా 'గోంబే మానే' సంస్థను ప్రారంభించారు. తన పూర్వీకులు మైసూర్ రాజుల ఆస్థానంలో చేతి వృత్తుల కళాకారులుగా పని చేసినట్లు తెలిపారు శ్రీధర్ మూర్తి.
"కొప్పల్ వ్యాపారవేత్త కోసం విగ్రహాన్ని సిలికాన్ మైనంతో తయారుచేశాం. ఇది ఇతర పదార్థాలతో పోలిస్తే చాలా ప్రత్యేకమైనది. సిలికాన్ మైనంతో చేసిన విగ్రహాలు త్వరగా పాడవ్వవు. రంగు కూడా చాలా సంవత్సరాలపాటు మన్నికగా ఉంటుంది. బొమ్మ కోసం ఫైబర్ గ్లాస్‌ను సిలికాన్ అస్థిపంజరగా ఉపయోగించాలని నిర్ణయించాం. ముందుగా మట్టి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో ఒక ఆకారాన్ని తయారు చేసి, దానిపై ఫైబర్ గ్లాస్ అంచును అమర్చాం. ఆ తర్వాత ఈ గ్లాస్‌పై సిలికాన్‌ను ఉంచి బొమ్మకు రూపాన్ని ఇచ్చాం. పూర్తైన తర్వాత గుప్తాకు అందించాం."
-శ్రీధర్ మూర్తి, శిల్ప కళాకారుడు.
తనతో పాటు గోంబే మానేకు చెందిన మరో 15 మంది కళాకారులు విగ్రహ తయారీలో పాలు పంచుకున్నట్లు తెలిపారు మూర్తి. ఈ విధంగా చేయటం మొదటి ప్రయత్నమని, కానీ విజయం సాధించినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి సతీమణికి నిలువెత్తు మైనపు విగ్రహం