బంగాల్ శారదా కుంభకోణంపై సుప్రీంకోర్టులో వాడీవేడి వాదనలు జరిగాయి. సీబీఐ తరపున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. కోల్‌కతా పోలీసు కమిషనర్ తరపున కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ వాదించారు.
శారదా కుంభకోణం విచారణలో సీబీఐకి సహకరించాల్సిందేనని కోల్‌కతా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఆయనను అరెస్ట్ చేయరాదని సీబీఐకి సుప్రీం తెలిపింది.
సీబీఐ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్లో బంగాల్ డీజీపీ, కోల్‌కతా సీపీకి నోటీసులు జారీ చేసింది అత్యున్నత న్యాయస్థానం.
సాక్ష్యాలను మాయం చేసేందుకు యత్నించారు
శారదా కుంభకోణంపై సుప్రీం కోర్టులో సీబీఐ ప్రమాణపత్రం దాఖలు చేసింది. దానిని కోర్టుకు వినిపించారు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్. సాక్ష్యాధారాలను ధ్వంసం చేసేందుకు కోల్‌కతా సీపీ యత్నించారని కోర్టుకు తెలిపారు ఏజీ. కోల్‌కతా పోలీసులు నకిలీ కాల్ రికార్డులను సమర్పించారని తెలిపారు.
కుంభకోణం విచారణకు నియమించిన సిట్‌కు సీపీ రాజీవ్ కుమార్ నేతృత్వం వహిస్తున్నారని, ఎన్నిసార్లు అడిగినా సేకరించిన సాక్ష్యాలను ఇవ్వలేడం లేదని కోర్టుకు విన్నవించారు. కనీసం స్పందించడం లేదన్నారు. కుంభకోణంలో కొందరు పోలీసు అధికారులు, నేతలు ఉన్నట్టు ఆధారాల్లో ఉన్నాయని తెలిపారు.
అందుబాటులో ఉండాలి : సుప్రీం
శారదా కుంభకోణం విచారణ సందర్భంగా సీబీఐకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని కోల్‌కతా పోలీసు కమిషనర్‌ను సుప్రీం ఆదేశించింది. పూర్తి సహకారాన్ని అందించాలని స్పష్టీకరించింది.
విచారణ వాయిదా
శారదా కుంభకోణంపై తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది అత్యున్నత న్యాయస్థానం.