కేరళలో నిరుపేద కుటుంబంలో పుట్టింది సుధ. పదోతరగతి వరకు చదివింది. ఆమెకు 16 ఏళ్లప్పుడు తట్టెక్కాడుకు చెందిన చంద్రన్‌తో పెళ్లైంది. పడవ నడిపేవాడు చంద్రన్. ఆయనకు చేదోడువాదోడుగా ఉండాలని చిన్న టీకొట్టు పెట్టింది సుధ. ఉన్నదాంట్లో తృప్తిగా బతుకుతున్న వాళ్ల జీవితంలో ఊహించని కష్టం ఎదురైంది. 'ఓ రోజు ఉన్నట్టుండి మా ఆయన కళ్లు తిరిగి పడిపోయాడు. డాక్టర్లకు చూపిస్తే.. మెదడులో కణతి ఉందన్నారు. ఆపరేషన్ చేయాలన్నారు. అంత స్తోమత లేదు. కొద్ది రోజుల్లోనే ఆయన దూరమయ్యాడు. ఒక్కసారిగా నా జీవితం అగాథం అయిపోయింది' అని చెబుతారు సుధ. భర్త చనిపోయేటప్పటికి ఆమె వయసు 32 ఏళ్లు. ఇద్దరు చిన్నపిల్లలు. తన తల్లిని సాయంగా తీసుకొచ్చి టీకొట్టు చూసుకోవడం మొదలుపెట్టింది.
పరిశోధకులతో కలిసి..
తట్టెక్కాడులో పక్షుల సంరక్షణ కేంద్రం ఉంది. 1983లో దీనిని ప్రారంభించారు. అయితే ఎన్నడూ పక్షుల గురించి ఆలోచించలేదు సుధ. భర్త, ఇల్లు, పిల్లలు ఇదే ఆమె ధ్యాస. మొదటిసారి.. తన పిల్లల కోసం.. జీవితం మెరుగవ్వాలని కోరుకుంది. ఆ వనంలో విహరించే పక్షులంత స్వేచ్ఛగా తన బిడ్డల బతుకులను తీర్చిదిద్దాలనుకుంది. అదే సమయంలో పక్షులపై పరిశోధన కోసం అధ్యయనకర్త డాక్టర్ సుగాథన్ తట్టెక్కాడు వచ్చారు. ఆయనతో పాటు పలువురు పరిశోధకులూ, విద్యార్థులూ తరచూ వచ్చేవారు. వారికి ఆహారం ఏర్పాటు చేసేది సుధ. విద్యార్థుల కోసం ఆయన నిర్వహించే తరగతులకు హాజరయ్యేది. దూరంగా ఉంటూనే ఆయనేం చెబుతున్నారో వినేది. పరిశోధకులతో కలిసి అడవిలో తిరుగుతూ పక్షుల పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆమెలోని ఉత్సాహాన్ని గమనించిన సుగాథన్ మరింత ప్రోత్సహించారు. గైడ్‌గా లైసెన్స్ ఇప్పించారు. దాదాపు 25 సంవత్సరాలుగా తన సేవలు అందిస్తోంది సుధ.
ఐదు భాషల్లో..
బర్డ్ శాంక్చురీకి వచ్చిన పర్యాటకులకు సుధ పక్షుల వివరాలన్నీ చెబుతుంది. అడవంతా తిప్పి చూపిస్తూ.. రకరకాల పక్షులను పరిచయం చేస్తుంది. 165 రకాల పక్షుల గురించి వివరంగా చెప్పేస్తుంది. దేశదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు సమాచారం అందివ్వడానికి వీలుగా వివిధ భాషల్లో పట్టుసాధించింది. మాతృభాష మలయాళంతో పాటు తమిళం, హిందీ, ఆంగ్లం, ఫ్రెంచి భాషలను అనర్గళంగా మాట్లాడే స్థాయికి చేరుకుంది.
గైడ్‌గా ఉంటూనే..
గైడ్‌గా పని చేస్తూనే.. తన ఇంటినే పర్యాటకులకు బసగా మార్చి, భోజనం అందిస్తూ ఆర్థికంగానూ నిలదొక్కుకుంది. 'నా భర్త పోయాక నాలుగేళ్లకు సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది. దాన్నుంచి బయటపడటానికి 25 సార్లు రేడియేషన్, ఐదుసార్లు కీమోథెరపీ చేయించుకున్నా. ఆ సమయంలో తట్టెక్కాడు వచ్చిన పర్యాటకులు అందించిన సహకారంతోనే బతికాను' అని చెబుతుంది సుధ.
రోజుకు 20 కి.మీ.
ఆమె క్యాన్సర్‌ను జయించి పాతికేళ్లు దాటిపోయింది. ఇప్పుడు సుధ వయసు 64 ఏళ్లు. ఇప్పటికీ ఉదయాన్నే పక్షుల కిలకిలలు వినేందుకు అడవిలోకి వెళ్తుంటుంది. రోజూ 20 కిలోమీటర్ల వరకూ తిరిగేస్తుంది. ఏ కొమ్మపైన ఏ పక్షి కొత్తగా వాలిందో చూసుకొని ఇంటికి వస్తుంది. ఆ విశేషాలన్నీ పర్యాటకులకు పూసగుచ్చినట్టు చెబుతుంటుంది. 'ఈ అడవి, పక్షుల కువకువలు... ఇవే నా ప్రాణం. ఈ వయసులోనూ ఉల్లాసంగా ఉన్నానంటే కారణం.. ఈ అడవితల్లే' అంటోందామె.
ఇదీ చదవండి: విశ్రాంతి తీసుకునే యోగాతో.. ఆరోగ్య యోగం!