దిల్లీ ఎయిమ్స్‌కి చెందిన వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి ఓ యువకుడి కడుపులో నుంచి ఏకంగా 20 సెంటీ మీటర్ల కత్తిని బయటకు తీశారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు.
ఇదీ జరిగింది...
హరియాణాకు చెందిన ఓ యువకుడు మత్తుపదార్థాలకు బానిసయ్యాడు. అతడికి డ్రగ్స్ దొరకని కారణంగా తట్టుకోలేక ఓ కత్తిని మింగేశాడు. ఎటువంటి ఇబ్బంది లేకుండా నెలన్నర పాటు సాఫీగా గడిపేశాడు. తర్వాత ఆకలి కాకపోవడం, పొత్తి కడుపులో నొప్పి రావటం మొదలైంది. అతని బాధ చూడలేకపోయిన కుటుంబ సభ్యులు.. ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు స్కాన్ చేసి చూసి ఆశ్చర్యపోయారు. అతని కాలేయం వద్ద కత్తి ఉండటాన్ని గుర్తించారు. దీంతో మెరుగైన వైద్య చికిత్స కోసం దిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించాలని సూచించారు. దీంతో అతడిని జులై 12న ఎయిమ్స్‌కు తరలించారు. 28 ఏళ్ల ఆ యువకుడికి దాదాపు 3 గంటల పాటు శ్రమించి సర్జరీ చేసి కత్తిని తొలగించారు.
ఇటీవల కాలంలో చాలా మంది సూదులు, కత్తెర మింగిన వారికి శస్త్ర చికిత్స చేసి సురక్షితంగా వాటిని తొలగించినట్లు తెలిపారు వైద్యులు. కానీ ఇతని విషయంలో కత్తి ఉన్న స్థానమే పెద్ద సమస్యగా మారిందన్నారు.
శస్త్ర చికిత్స చేయటానికి కంటే ముందు శరీరంలోని అంతర్గత గాయాలను తొలగించటానికి రేడియాలజిస్ట్ చేత చికిత్స అందించినట్లు పేర్కొన్నారు వైద్యులు.