దిల్లీ ఘర్షణలపై విపక్షసభ్యులు చర్చకు పట్టుబడుతున్న కారణంగా పార్లమెంట్ కార్యకలాపాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. రాజ్యసభ కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే.. ఇటీవల మృతి చెందిన మాజీ సభ్యులకు ఎగువ సభ నివాళి అర్పించింది. అనంతరం ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రశ్నోత్తరాలను ప్రారంభించగా దిల్లీ అల్లర్లపై చర్చకు విపక్షాలు డిమాండ్ చేశాయి. నినాదాలు చేస్తూ విపక్ష సభ్యులు అడ్డుతగిలిన కారణంగా శాంతించాలని వెంకయ్య పదేపదే విజ్ఞప్తి చేశారు. విపక్షాలు నినాదాలు కొనసాగించిన కారణంగా సభను రేపటికి వాయిదా వేశారు.
లోక్సభలో వాయిదాల పర్వం..
లోక్సభ ప్రారంభమైన వెంటనే ముందస్తు ప్రణాళిక మేరకు ఆయా సమస్యలపై చర్చను ప్రారంభించారు ప్యానెల్ స్పీకర్ కిరీట్ ప్రేమ్భాయ్ సోలంకి. ఈ నేపథ్యంలో ఘర్షణలపై చర్చించాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. తర్వాత అవకాశం కల్పిస్తామని.. ప్రణాళిక మేరకు సభ జరగనివ్వాలని ప్యానెల్ స్పీకర్ చేసిన విజ్ఞప్తి చేసినా సభ్యులు పట్టించుకోని కారణంగా 12 గంటలకు మొదటిసారి వాయిదా వేశారు. 12 గంటలకు సమావేశమైన అనంతరం కూడా సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రెండు గంటలకు వాయిదా పడింది.
ఇదీ చూడండి: రోజుకు 7 సార్లు రంగు మార్చే శివ లింగం!