సూపర్ స్టార్ రజినీకాంత్ ఎట్టకేలకు రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నారా? మే-జూన్లో ఎప్పుడైనా కొత్త పార్టీని ప్రకటించవచ్చా? అవుననే అంటున్నారు రజినీ సన్నిహితుడు కరాటే త్యాగరాజన్. 2021లో జరిగే తమిళనాడు శాసనసభ ఎన్నికలు... రజినీకాంత్కు, డీఎంకేకు మధ్య ప్రత్యక్ష సమరం అవుతాయని జోస్యం చెప్పారు.
"మే లేదా జూన్లో రజినీకాంత్ రాజకీయ పార్టీ ప్రారంభిస్తారు. రజినీని ఎదుర్కోవాలంటే స్టాలిన్ మరింత కసరత్తు చేయాలి. ఈ మధ్య ఆయన(స్టాలిన్) తలైవా గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. అలా చేస్తే వార్తల్లోకి ఎక్కవచ్చన్నది ఆయన ఆలోచన.
రజినీకాంత్ తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారు. అధికారికంగా రాజకీయ పార్టీ ప్రారంభించాక.. డీఎంకే, అన్నాడీఎంకే కార్యకర్తలంతా రజినీకి మద్దతుగా నిలుస్తారు."
-కరాటే త్యాగరాజన్, రజినీ సన్నిహితుడు
హిందుత్వ విషయంలో ప్రత్యర్థుల విమర్శల్ని తిప్పికొట్టారు త్యాగరాజన్. "రజినీకాంత్ హిందూ ధర్మాన్ని నమ్ముతారు కానీ హిందుత్వను కాదు" అని స్పష్టంచేశారు.
రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని 2017 డిసెంబర్లోనే ప్రకటించారు రజినీ. కానీ ఇప్పటివరకు ఎలాంటి ముందడుగు వేయలేదు.