కరోనా వైరస్ టీకా 'కొవాగ్జిన్'పై 2వ దశ క్లినికల్ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని (సేఫ్టీ అండ్ ఇమ్యునోజెనిసిటీ డేటా) తనకు అందించాలని డీసీజీఐ (డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా), భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్‌కు సూచించింది. అంతేగాక కొన్ని ఇతర వివరాలు కూడా అడిగినట్లు సమాచారం. ‘కొవాగ్జిన్’పై 3వ దశ క్లినికల్ పరీక్షలు నిర్వహించటానికి ఇటీవల భారత్ బయోటెక్, డీసీజీఐ (డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) అనుమతి కోరింది.
ఇందులో భాగంగా ఇప్పటికే మొదటి దశ పరీక్షల సమాచారాన్ని, 2వ దశ పరీక్షలకు సంబంధించిన మధ్యంతర సమాచారాన్ని డీసీజీఐకి అందజేసింది. 3వ దశ క్లినికల్ పరీక్షలను 19 ప్రదేశాల్లో 18 ఏళ్ల వయసు పైబడిన 28,500 మంది వలంటీర్లపై నిర్వహించనున్నట్లు నివేదించింది. ఈ నేపథ్యంలో 3వ దశ క్లినికల్ పరీక్షల నిర్వహణకు అనుమతి ఇచ్చే అంశాన్ని సీడీఎస్‌సీఓ (సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్)కు చెందిన సబ్జెక్టు నిపుణుల కమిటీ పరిశీలించింది.
3వ దశ పరీక్షల నిర్వహణ ప్రణాళిక సంతృప్తికరంగా ఉన్నట్లు, అయినప్పటికీ 2వ దశ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పరిశీలించాల్సి ఉందని ఈ కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం. ఇప్పటి వరకూ ఈ టీకాపై నిర్వహించిన పరీక్షల్లో ఫలితాలు సంతృప్తికరంగానే ఉన్నట్లు, ఎటువంటి సైడ్‌ఎఫెక్ట్ సమస్యలు కనిపించలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి:మహారాష్ట్రలో 40వేలు దాటిన కరోనా మరణాలు