స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని మోదీ అన్నారు. మధ్యంతర బడ్జెట్లో రైతులు, కార్మికులకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని మోదీ ప్రస్తావించారు.
ఎన్నికల తర్వాత ప్రవేశ పెట్టబోయే పూర్తి బడ్జెట్లో యువత, రైతులతో పాటు సమాజంలోని అన్ని వర్గాలకు మరింత ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు మోదీ.
ప్రధాని ప్రసంగం మొదలు పెట్టిన కొద్ది సేపటికే సభలో గందరగోళ పరిస్థితి తలెత్తింది. భాజపా కార్యకర్తలు బారికేడ్లను దాటుకుంటూ సభ దగ్గరికి చేరుకునే ప్రయత్నం చేశారు. పరిస్థితి తొక్కిసలాటకు దారితీయగా 14 నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని పూర్తి చేసి సభను వీడారు మోదీ.
"స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదు. పశ్చిమ బంగలో పరిస్థితి మరీ దారుణం. నిన్న ఒక చారిత్రక అడుగు వేశాం. ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ప్రభుత్వం తరఫున ఏడాదికి ఆరు వేల రూపాయలను నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమచేస్తాం. కొన్ని రాష్ట్రాల్లో ఓట్ల కోసం రైతులకు రుణ మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ పరిస్థితి వేరు. అసలు రుణాలు తీసుకోని రైతుల రుణాలే మాఫీ అవుతున్నాయి.''
-నరేంద్ర మోదీ, ప్రధాని