తపన ఉంటే ఏదైనా సాధించవచ్చనే విషయాన్ని నిరూపించారు తమిళనాడు కరూర్ జిల్లాకు చెందిన విద్యార్థులు అద్నాన్, కేశవన్, అరుణ్. సైన్స్‌పై తమకున్న అమితమైన ప్రేమతో అద్భుతాన్ని సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత తేలికైన ఉపగ్రహాన్ని తయారు చేసి ప్రతిభను చాటుకున్నారు. దీనికి 'ఇండియన్ సాట్' అని పేరు పెట్టారు.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా), ఐఎన్‌సీ సంయుక్తంగా 'క్యూబ్స్ ఇన్ స్పేస్' పోటీ నిర్వహించాయి. 73 దేశాలకు చెందిన 11-18 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లోనే విజేతలుగా నిలిచారు తమిళనాడు విద్యార్థులు. వారు సృష్టించిన తేలికైన ఉపగ్రహాన్ని నాసా ఎంపిక చేసుకుంది. ఎస్ఆర్-7 రాకెట్ ద్వారా వచ్చే ఏడాది జూన్‌లో దీనిని అంతరిక్షంలోకి పంపనుంది.
చిన్న పరిమాణం..
64 గ్రాములున్న ఈ ఉపగ్రహాన్ని రీఎన్ఫోర్స్డ్ గ్రాఫేన్‌తో తయారు చేశారు. దీని చుట్టు కొలత 3సెంటీమీటర్లు. 3.3 ఓల్టుల సౌర శక్తితో పనిచేస్తుంది. 13 రకాల సమాచారాన్ని గుర్తించగలదు.
మొదటిసారి విఫలం..
అద్నాన్, కేశవన్, అరుణ్ 12వ తరగతి చదువుతున్నప్పుడు తొలిసారి 'క్యూబ్స్ ఇన్ స్పేస్' పోటీలో పాల్గొన్నారు. అయితే సరైన అనుభవం లేని కారణంగా వారు విజయం సాధించలేకపోయారు. ఓటమే విజయానికి పునాది అన్నట్లుగా వారు తమ ప్రయత్నాన్ని కొనసాగించారు. 2018 నుంచి కొత్త ఉపగ్రహాన్ని తయారు చేయడం మొదలుపెట్టారు. 2019-20 పోటీల్లో విజేతలుగా నిలిచారు.
" తమిళనాడు, కరూర్ జిల్లా గర్వ పడేలా చేయాలనే ఈ ఉపగ్రహాన్ని నిర్మించాం. దీని కోసం రూ.1.35 లక్షలు ఖర్చు చేశాం. మా శ్రమకు ఫలితం దక్కినందుకు ఇప్పుడు ఆనందంగా ఉంది."
- అద్నాన్, విద్యార్థి
సాయం చేయాలి..
ఈ విద్యార్థుల ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు అధ్యాపకురాలు శివగామి వారికి మద్దతుగా నిలిచారు. ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపే వరకు ఇంకా ఖర్చు అవుతుందని ఆమె చెప్పారు. ఎవరైనా ముందుకొచ్చి సాయం అందించాలని కోరారు.
"మొదట్లో ఆర్థిక సాయం లేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రభుత్వ కళాశాల విద్యార్థులు రూపొందించిన ఉపగ్రహాన్ని నాసా ఎంపిక చేయడం గొప్ప గౌరవం. ఈ శాటిలైట్‌ను నిర్మించేందుకు అవసరమైన సామగ్రిని అమెరికా నుంచి తెప్పించాం. అందుకే ఖర్చు, సమయం ఎక్కువ అయింది. ఆర్థిక సాయం అందించాలని డైరెక్టర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్‌కు దరఖాస్తు చేశాం. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు విద్యార్థులకు ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నాం. ఇలాంటి విద్యార్థుల అద్భుత ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ప్రభుత్వం బాధ్యత. ఇతర విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు ఆదుకోవాలి."
- శివగామి, అధ్యాపకురాలు.