మధ్యప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా సుప్రీంకోర్టు... రెబల్ ఎమ్మెల్యేలతో వీడియో లింక్ ద్వారా మాట్లాడాలని మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ఎన్.పి.ప్రజాపతికి సూచించింది. శాసనసభ్యులు బందిఖానాలో ఉన్నారన్న భయాన్ని తగ్గించేందుకు కోర్టు ఒక పరిశీలకుడిని నియమిస్తుందని స్పష్టం చేసింది.
జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హేమంత్ గుప్తాల ద్విసభ్య ధర్మాసనం ఈ ప్రతిపాదనలు చేసింది. దీని వల్ల రెబల్ శాసనసభ్యులు స్వచ్ఛందంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొంది.
"మేము బెంగళూరు లేదా మరో ప్రదేశానికి ఒక పరిశీలకుడిని పంపిస్తాం. ఫలితంగా తిరుగుబాటు ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా స్పీకర్ మాట్లాడడానికి వీలవుతుంది. అలా మాట్లాడిన తరువాత స్పీకర్ ఓ నిర్ణయం తీసుకోవచ్చు. "- ధర్మాసనం
అయితే సర్వోన్నత న్యాయస్థానం ప్రతిపాదనపై స్పీకర్ ప్రజాపతి అభ్యంతరం వ్యక్తం చేశారు.
రాజీనామాల సంగతేంటి?
తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలపై ఏ నిర్ణయం తీసుకున్నారో తెలియజేయాలని స్పీకర్ ప్రజాపతిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
రాజ్యాంగ సంక్షోభానికి హేతువు
స్పీకర్ ప్రజాపతి తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ఎ.ఎమ్. సింఘ్వీ... న్యాయస్థానాలు స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వడం ప్రారంభమైతే... అది రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందని తెలిపారు.
గవర్నర్ లాల్జీ టాండన్ తరపున హాజరైన న్యాయవాది... ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఓ పక్కన కూర్చున్నారని, ఇప్పుడు మధ్యప్రదేశ్ రాజకీయాలను స్పీకర్ ప్రజాపతి శాసిస్తున్నారని వాదించారు.
విశ్వాస పరీక్షను ప్రభావితం చేస్తుందా?
ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్హత విషయాల్లో స్పీకర్ నిర్ణయం... విశ్వాస పరీక్షను ఎలా ప్రభావితం చేస్తుందో కూడా తెలిపాలని ధర్మాసనం అన్ని పార్టీలను ప్రశ్నించింది. రాజీనామా, అనర్హత విషయాలు స్పీకర్ ముందు పెండింగ్‌లో ఉన్నా.. విశ్వాస పరీక్ష నిర్వహించడానికి ఎలాంటి అడ్డంకి లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.