ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో మానవ నిర్మిత అడవి ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి మోదీ కూడా ఈ అడవికి అభిమానిగా మారిపోయారు. పులిని ఫొటో తీస్తున్న ఆయన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రాయ్‌పూర్ రైల్వేస్టేషన్ నుంచి 35 కిలోమీటర్లు, స్వామీ వివేకానంద విమానాశ్రయం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో నయా రాయ్‌పూర్‌లో ఈ జంగిల్ సఫారీ ఉంది. 800 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ అడవిలో పులులు, సింహాలు, ఎలుగుబంట్లు సందడి చేస్తుంటాయి.
![Man made forest jungle safari in Chattisgarh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8832959_photos.jpg)
![Man made forest jungle safari in Chattisgarh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8832959_modi.jpg)
పార్కును తలపిస్తుంది!
జంగిల్ సఫారీ ప్రధాన ద్వారం వద్దకు చేరుకోగానే... ఏదో పెద్ద పార్కు లేదా తోటకు వచ్చిన అనుభూతి కలుగుతుంది. పచ్చటి వాతావరణంలో కాస్త ముందుకు వెళ్లగానే జంగిల్ సఫారీ నిర్వహణ బృందం స్వాగతం పలుకుతుంది. హాలులోని గోడలపై కనిపించే చిత్రాలు... ఛత్తీస్‌గఢ్ వన్యప్రాణుల సంపదను ప్రతిబింబిస్తాయి. ఇక్కడ కొంచెంసేపు ఎదురుచూసిన తర్వాత.. సఫారీకి తీసుకెళ్లేందుకు బస్సు వస్తుంది. ఖండ్వారా జలాశయం పక్కనుంచి, బస్సు వెళ్తుండగా...అడవి దట్టంగా మారుతూ ఉంటుంది.
![Man made forest jungle safari in Chattisgarh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8832959_bus.jpg)
![Man made forest jungle safari in Chattisgarh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8832959_water.jpg)
జింకల కోసమే అంజన్ చెట్లు...
జంగిల్ సఫారీలో నాలుగు విభిన్న సఫారీలకు నాలుగు మార్గాలుంటాయి. మునుపు ఇక్కడ నర్సరీ ఉండేది. ఖండ్వా జలాశయం నిర్మించి, అడవి రూపు తీసుకువచ్చారు. జింకల్లాంటి శాకాహార జంతువుల నివాసానికి వీలుగా, అడవిని దట్టంగా మార్చేందుకు అంజన్ చెట్లను భారీమొత్తంలో నాటారు. కొద్దిదూరంలో వాచ్‌టవర్ కనిపిస్తుంది. ఈ దట్టమైన అడవిలో ఎంత దూరం నుంచైనా కనిపించేలా కొన్ని వాచ్టవర్లు ఏర్పాటు చేశారు.
![Man made forest jungle safari in Chattisgarh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8832959_forest.jpg)
దగ్గర నుంచి చూడొచ్చు!
దాదాపు 2 కిలోమీటర్ల సఫారీ తర్వాత.. హెర్బీవోర్ సఫారీ వస్తుంది. శాకాహార జంతువులైన జింక జాతికి చెందిన చీతల్, బ్లాక్డీర్, సంబర్, బ్లూబుల్స్ ఇక్కడ ఉంటాయి. 300 రకాలకు పైగా జింకలు ఇక్కడ ఉంటాయి. వాటికోసం చిన్నచిన్న నీటితొట్టెలు ఏర్పాటుచేశారు. పచ్చగడ్డితో పాటు, ధాన్యపు గింజలూ జింకలకు ఆహారంగా పెడతారు. పూర్తి సహజసిద్ధ వాతావరణంలో జింకలు వేగంగా పెరుగుతున్నాయి. వాటిని దగ్గరి నుంచి చూడడం మంచి అనుభూతి కలిగిస్తుంది.
![Man made forest jungle safari in Chattisgarh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8832959_forest1.jpg)
తర్వాత ఎలుగుబంట్ల ప్రపంచంలోకి ప్రవేశిస్తాం. ఈ సఫారీలోకి అడుగుపెట్టగానే బస్సు తలుపులు సరిగా మూసి ఉన్నాయో లేదో గైడ్ ఓసారి చెక్ చేస్తాడు. హెర్బీవోర్ సఫారీలో బస్సు దిగి, జింకల్ని దగ్గరి నుంచి చూస్తాం. కానీ ఎలుగుబంట్లను బస్సులో నుంచే చూడాల్సి ఉంటుంది. ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ఎలుగులు పెద్దసంఖ్యలో ఉంటాయి. 50 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎలుగుబంటి సఫారీలో ప్రస్తుతం 5 ఎలుగులు ఉన్నాయి.
![Man made forest jungle safari in Chattisgarh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8832959_forest3.jpg)
స్వేచ్ఛగా తిరిగే పులులు
బియర్ సఫారీ తర్వాత వచ్చేది దట్టమైన టైగర్ సఫారీ. జూలలో బోనులో ఉండే పులులనే చూస్తాం. ఇక్కడ స్వేచ్ఛగా తిరుగాడే పులులను చూడడం మంచి అనుభూతినిస్తుంది. పులుల సామ్రాజ్యం 50 ఎకరాల్లో ఉంది. నాలుగు పులులున్నాయి. వీటి కోసమే ఓ ప్రత్యేక నీటి వనరు ఏర్పాటు చేశారు. ఆహారం పెట్టేందుకు ఓ ప్రత్యేక ప్రాంతం కేటాయించారు. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఠీవీగా నడిచే పులులు, వాటి జలక్రీడలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.
![Man made forest jungle safari in Chattisgarh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8832959_tiger.jpg)
అడవికి జీవనాధారం
టైగర్ సఫారీ తర్వాత... లయన్ సఫారీ వైపుగా బస్సు కదులుతుంది. ఇది కూడా 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైంది. 3 సింహం పిల్లలతో తిరుగాడే ఓ ఆడ సింహం ఇక్కడ కనిపిస్తుంది. 4 సఫారీలు పూర్తయిన తర్వాత ఖండ్వా జలాశయం చూడొచ్చు. ఈ అడవికి ఇదే జీవనాధారం. జలాశయంలో బోటింగ్ చేసే అవకాశం కూడా ఉంది.
![Man made forest jungle safari in Chattisgarh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8832959_boating.jpg)
ఇదీ చూడండి: సైకత కళతో మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు