వాహనదారుల చిట్టాను ఆన్లైన్లో తప్పనిసరిగా నమోదు చేయాలన్న కేంద్ర రహదారి, రవాణా శాఖ నిబంధనలు.. గురువారం నుంచే (అక్టోబర్ 1) అమలులోకి రానున్నాయి. వాహనాల డాక్యుమెంట్లు, ఈ-చలానాలు అన్నీ ఆన్లైన్లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఇటీవలే రాష్ట్రాలను ఆదేశించింది కేంద్రం.
ఆన్లైన్లో ఎందుకు.?
ఎలక్ట్రానిక్ పద్దతిలో డాక్యుమెంట్లను పర్యవేక్షించడం, ట్రాఫిక్ నిబంధనలను అమలు చేయడం సులభం. అంతేకాదు డ్రైవర్లకు.. పోలీసులు, ఇతర రవాణా శాఖ సిబ్బంది నుంచి అనవసరమైన వేధింపులు తగ్గుతాయని భావిస్తోంది కేంద్ర రహదారి, రవాణా మంత్రిత్వ శాఖ.
ఆన్లైన్లో ఉంటే.. కాగితాల రూపంలో అడగొద్దు..
డ్రైవింగ్ లైసెన్సుల రద్దు, పునరుద్ధరణ లాంటి వివరాలను తేదీల ప్రకారం రవాణా పోర్టల్లో నమోదు చేయాలని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. దాని ఆధారంగా డ్రైవర్ల ప్రవర్తనను కూడా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించింది. వాహన పత్రాలు ఎలక్ట్రానిక్ విధానంలో అందుబాటులో ఉంటే.. తనిఖీ కోసం వాటిని కాగితాల రూపంలో అడగాల్సిన అవసరం లేదని సూచించింది. ఏదైనా నేరం జరిగినప్పుడు వాహనాన్ని సీజ్ చేయడానికి కూడా అవేమి అవసరం లేదని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిబంధనలు కీలకం కానున్నాయి.
పోలీసులు, ఇతర రవాణా శాఖ అధికారులు.. డాక్యుమెంట్లను తనిఖీ చేసినప్పడు తప్పనిసరిగా పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశించింది. దీనివల్ల తనిఖీల పేరుతో డ్రైవర్లను వేధించడం తప్పుతుందని తెలిపింది. అలాగే డ్రైవర్లకు అనువైన కమ్యునికేషన్ పరికరాలు ఇవ్వాలని, వాటిని కేవలం మార్గం (రూట్ నావిగేషన్) తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగించాలని పేర్కొంది. దాని వల్ల డ్రైవింగ్ చేసే సమయంలో డ్రైవర్ల దృష్టి మరలకుండా ఉంటుందని వెల్లడించింది.
ఇదీ చూడండి:జీఎస్టీ, ఐటీ రిటర్నులకు గడువు పెంపు