విద్యుత్ సరఫరాలో అంతరాయం వస్తే వెంటనే గ్రామ లైన్మెన్ను తీసుకొచ్చి సమస్యను పరిష్కారించుకుంటాం. కానీ విద్యుత్ స్తంభాలు ఎక్కుతూ, కరెంట్ సమస్యలను పరిష్కరిస్తున్న మహిళను ఎక్కడైనా చూశారా? ఏంటి ఆశ్చర్యపోతున్నారా? అవునండి మహారాష్ట్ర బీడ్ జిల్లాకు చెందిన ఉషా జగ్దలే అనే మహిళ చాలా చాకచక్యంగా స్తంభాలను ఎక్కుతూ అందరి సమస్యలను పరిష్కరిస్తుంది.
ఉషది నిరుపేద రైతు కుటుంబం. స్వగ్రామం బీడ్జిల్లా అష్ట గ్రామం. పేద కుటుంబం కావటం వల్ల చిన్న వయస్సులో చదువు మాన్పించి ఆమెకు వివాహం చేశారు తల్లిదండ్రులు. పెళ్లి అనంతరం పాల వ్యాపారంలో భర్తకు చేదోడువాదోడుగా ఉంటూ వస్తోంది. ఉష చిన్నప్పటి నుంచి చాలా చలాకీగా ఉండేది. క్రీడల్లో మంచి నైపుణ్యం ఉంది. ఆమె ప్రావీణ్యాన్ని ఆసరాగా చేసుకుని మహరాష్ట్ర విద్యుత్ శాఖలో ఉద్యోగం సంపాదించింది ఉష.
ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా తనే స్వయంగా వెళ్లి పరిష్కరిస్తుంది. కరోనా సంక్షోభంలోనూ వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవిశ్రాంతంగా పని చేస్తోంది.
ఇలా ఆమె స్తంభం ఎక్కుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఉష పనితీరు చూసి అనేక మంది అభినందిస్తున్నారు. అయితే సరైన భద్రతా ప్రమాణాలు లేకుండా ఎక్కటంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.