కరోనా మహమ్మారిపై పోరాటం కోసం 'ఆపరేషన్ నమస్తే' ప్రారంభించింది భారత సైన్యం. ఈ విషయాన్ని దిల్లీలో వెల్లడించారు సైన్యాధిపతి ఎంఎం నరవాణే. ఇప్పటికే దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో సైన్యం 8 నిర్బంధ కేంద్రాలు ప్రారంభించిందని తెలిపారు.
"కరోనా మహమ్మారిపై పోరాటంలో ప్రభుత్వానికి అండగా నిలవడం సైన్యం బాధ్యత. సైన్యం మొత్తాన్ని ఆరోగ్యంగా ఉండేలా చూడడం సైన్యాధిపతిగా నా ప్రాధాన్యం. కరోనా నుంచి మమ్మల్ని మేము కాపాడుకోగలిగినప్పుడే దేశం కోసం విధులు నిర్వర్తించగలం. వేర్వేరు కారణాల దృష్ట్యా సైన్యంలో సామాజిక దూరం పాటించడం కష్టం. అందుకే సైనికులు తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలతో గత కొద్ది వారాల్లో 3 సార్లు మార్గదర్శకాలు జారీ చేశాము. అందరూ వాటికి లోబడి పనిచేయాల్సిందే."
-ఎంఎం నరవాణే, సైన్యాధిపతి
సెలవుల రద్దు...
ఆపరేషన్ నమస్తే కోసం సైనికుల సెలవులన్నీ రద్దు చేయడంపై స్పందించారు నరవాణే. 2001-02లో ఆపరేషన్ పరాక్రమ్ సమయంలోనూ సైనికులు 8-10 నెలలపాటు సెలవులు తీసుకోలేదని గుర్తుచేశారు. ఇప్పుడూ అదే స్ఫూర్తితో పనిచేయాలని కోరారు. ఎక్కడో దూరంగా ఉన్న కుటుంబసభ్యుల గురించి జవాన్లు దిగులుపడాల్సిన అవసరంలేదని, వారి సంక్షేమం కోసం సైన్యం అవసరమైన చర్యలన్నీ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు నరవాణే.