ఇతర దేశాలతో పోలిస్తే కరోనా కట్టడి విషయంలో భారత్ మెరుగ్గా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని తెలిపారు. భారత్‌పై వైరస్ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుందని ఈ ఏడాది మొదట్లో కొంత మంది అంచనా వేశారని గుర్తు చేశారు. అయితే లాక్డౌన్ సహా ప్రజల సహకారంతో ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల మెరుగైన ఫలితాలు రాబట్టినట్లు పేర్కొన్నారు.
డా. జోసెఫ్ మర్ తోమా మెట్రోపాలిటన్ 90వ జన్మదిన వేడుకల కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు ప్రధాని మోదీ. సమాజ ఉన్నతికి జోసెఫ్ మర్తోమా తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. పేదరిక నిర్మూలన, మహిళా సాధికారికత విషయాల్లో చురుగ్గా పాల్గొన్నారన్నారు. ఆయన దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్‌కేర్ వ్యవస్థ ఆయుష్మాన్ భారత్ దేశంలో ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు మోదీ. 8 కోట్ల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్ అందించి.. వంటగదులను పొగరహితం చేసినట్లు తెలిపారు. ఇల్లు లేని వారికి ఆశ్రయం కల్పించేందుకు 1.5 కోట్ల ఇళ్లను సిద్ధం చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి- దేశంలో 5 లక్షలు దాటిన కరోనా కేసుల సంఖ్య