ఐఐటీ ఖరగ్‌పూర్ పరిశోధకులు అత్యంత చౌకైన 'కొవిడ్ టెస్ట్ కిట్'ను రూపొందించారు. దీని ద్వారా చాలా వేగంగా కరోనా నిర్ధరణ పరీక్ష చేయవచ్చని... ఫలితంగా పేదవారికి ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
"మేము రూపొందించిన 'కొవిరాప్' టెస్ట్ కిట్ ధర రూ.2000. దీని ద్వారా కరోనా నిర్ధరణ పరీక్ష చేసేందుకు అయ్యే ఖర్చు కేవలం రూ.400 మాత్రమే. పరీక్ష ఫలితం కేవలం గంట వ్యవధిలోనే మీ మొబైల్ అప్లికేషన్‌కు వస్తుంది."
- ప్రొఫెసర్ సుమన్ చక్రవర్తి, మెకానికల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్
పేటెంట్ కోసం...
ఈ కొవిడ్ టెస్ట్ కిట్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తే... తయారీ ఖర్చు భారీగా తగ్గుతుందని ప్రాజెక్ట్‌లో కీలక భూమిక పోషించిన ప్రొఫెసర్ సుమన్ చక్రవర్తి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ 'కొవిరాప్' కిట్‌పై పేటెంట్ హక్కుల కోసం సంస్థ తరపున దరఖాస్తు చేసినట్లు ఆయన తెలిపారు.
సరళంగా... కచ్చితంగా...
"ప్రయోగశాల పరికరాల కంటే చాలా సరళంగా కొవిరాప్ కిట్ ద్వారా కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించవచ్చు. ఆర్టీ-పీసీఆర్ టెస్ట్‌ల కంటే కూడా చాలా కచ్చితమైన ఫలితాలు పొందవచ్చు."
- ప్రొఫెసర్ సుమన్ చక్రవర్తి, మెకానికల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్
కాగిత రహితంగా...
కొవిరాప్ ద్వారా నిర్వహించే పరీక్షల ఫలితాలు కాగిత రహితంగా ఉంటాయని ప్రొఫెసర్ సుమన్ చక్రవర్తి తెలిపారు. కరోనా నిర్ధరణ పరీక్ష ఫలితాలు మీ మొబైల్ అప్లికేషన్కే నేరుగా వస్తాయని స్పష్టం చేశారు.
కొవిరాప్తో కేవలం కరోనా నిర్ధరణ పరీక్షలు మాత్రమే కాకుండా... ఇతర 'ఆర్ఎన్ఏ' పరీక్షలు కూడా నిర్వహించవచ్చని పరిశోధన బృందం వెల్లడించింది. ఈ పరికరాన్ని లాభం కోసం కాకుండా... కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఉపయోగించాలన్నదే తమ ధ్యేయమని ఆయన అన్నారు.
ఈ 'కొవిరాప్' పరికరాన్ని రూపొందించిన పరిశోధన బృందానికి.. మెకానికల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ తరపున ప్రొఫెసర్ సుమన్ చక్రవర్తి, స్కూల్ ఆఫ్ బయోసైన్స్ తరపున అసిస్టెంట్ ప్రొఫెసర్ అరిందమ్ మొండల్ నేతృత్వం వహించారు.
ఇదీ చూడండి: ఆ సంస్థల కొవిడ్ కిట్ల దిగుమతి లైసెన్సులు రద్దు