వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసి) వెంబడి చైనాతో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కశ్మీర్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకూ ఉగ్రవాదుల చొరబాట్లతో సమస్యలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయుధాల కొనుగోలు ఒప్పందాలపై భారత్ దృష్టి సారించింది.
రష్యాతో 2019 ఫిబ్రవరి 18న అంతర్ ప్రభుత్వ ఒప్పందం (ఐజీఏ) జరిగిన ఏకే-203 రైఫిళ్ల కొనుగోలును వేగవంతం చేయాలని భారత్ భావిస్తోంది. ఆగస్టు చివరినాటికి రెండు దేశాల మధ్య ఒప్పందాన్ని అధికారికంగా ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి.
అనుమతుల ప్రక్రియ పూర్తి..
రష్యాలో ఆగస్టు 23-29 మధ్య జరిగే 'ఆర్మీ-2020' కార్యక్రమానికి భారత రక్షణ శాఖ కార్యదర్శి వెళ్లనున్నారు. ఈ సమయంలోనే 'కొనుగోలు, తయారీ' మార్గంలో ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేసే అవకాశం ఉంది.
ఏకే 203 రైఫిళ్ల కొనుగోలును వేగవంతం చేసేందుకు కావాల్సిన అనుమతులకు రక్షణ శాఖ సమీకరణ మండలి (డీఏసీ) మంగళవారం పచ్చజెండా ఊపింది. ఈ కొనుగోలు ఒప్పందం పూర్తయితే అసాల్ట్ రైఫిళ్ల కోసం భారత్ సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తుంది.
ఆర్మీ-2020
ఆర్మీ- 2020.. రష్యా ప్రభుత్వం నిర్వహిస్తున్న అంతర్జాతీయ సైన్యం, సాంకేతిక ఫోరం ఇది. అంతర్జాతీయ సైన్యం, సాంకేతిక సహకారం బలోపేతంపై చర్చించేందుకు ఈ వేదికను ఏర్పాటు చేశారు. ఆర్మీ-2020తో పాటు 'అంతర్జాతీయ సైనిక క్రీడలు-2020'ను నిర్వహిస్తారు. ఈ సారి భారత్ ఇందులో పాల్గొనటం లేదు.
ఒప్పంద ప్రక్రియలో మలుపులు..
రష్యాతో రూ.12,280 కోట్లతో 7.40 లక్షల రైఫిళ్ల కొనుగోలుకు భారత రక్షణ శాఖ 2018 ఫిబ్రవరి 13న అంగీకారం తెలిపింది. 2018 అక్టోబర్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన సందర్భంగా ఏకే 203 రైఫిళ్ల కొనుగోలుకు సిద్ధమని ప్రకటించింది.
2019 ఫిబ్రవరి 18 నాటి ఐజీఏ తర్వాత ఈ ఒప్పందంలో పురోగతి లేదు. రైఫిల్ ధర, సాంకేతిక సహకారం బదిలీకి సంబంధించి రెండు దేశాల మధ్య ఏర్పడిన విభేదాలే ఇందుకు కారణం. ప్రస్తుతం ఈ విభేదాలు తొలగిపోయినట్లు తెలుస్తోంది.
రెండు దేశాల భాగస్వామ్యంతో..
ఒప్పందం కుదిరితే లక్ష రైఫిళ్లను రష్యా నుంచి నేరుగా కొనుగోలు చేస్తుంది భారత్. మిగితావి ఏడాదికి 75 వేల రైఫిళ్ల చొప్పున ఉత్తర్ప్రదేశ్ అమేఠీలోని కోర్వా కర్మాగారంలో ఉత్పత్తి చేస్తారు. వీటిని 'ఇండో రష్యా రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్' ఉత్పత్తి చేస్తుంది.
ఇందులో భారత్లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు 50.5 శాతం పెట్టుబడులు పెడుతుండగా.. కలాశ్నికోవ్ కాన్సర్న్, రోసోబరోన్ఎక్స్పోర్ట్ సంస్థలు వరుసగా 42 శాతం, 7.5 శాతం అందిస్తాయి. ఏకే 203 రైఫిళ్లకు సంబంధించి మరో దేశానికి రష్యా సాంకేతికత బదిలీ చేయటం ఇదే తొలిసారి.
ఇన్సాస్ స్థానంలో..
క్షేత్రస్థాయి సైనికుల అవసరాలను సమర్థమైన ఈ బేసిక్ రైఫిళ్లు తీర్చనున్నాయి. ప్రస్తుతం సైనికుల వద్ద ఉన్న దేశీయంగా తయారు చేసిన ఇన్సాస్ రైఫిళ్లను ఇవి భర్తీ చేస్తాయి. ఇన్సాస్ పనితనంపై అనేక ఫిర్యాదులు వచ్చాయి.
ఏకే గన్స్ శ్రేణిలో 203 మోడల్ చాలా అధునాతనమైనది. ప్రపంచవ్యాప్తంగా ఈ స్థాయి తుపాకుల్లో ఇదే అగ్రగామి. ఏకే 103, ఏకే 15 కన్నా భారత సైనికుల అవసరాలను తీర్చగల శక్తి ఏకే 203కు ఉందని విశ్లేషకులు అంటున్నారు. అయితే భారత్ దిగుమతి చేసుకునే మోడల్.. అసలు ఏకే 203 కన్నా కొద్దిగా భిన్నమైనదని తెలుస్తోంది.
ప్రత్యేకతలు..
4 కిలోల బరువు ఉండే ఈ ఏకే 203 గన్.. ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ మోడ్లలో పనిచేయగలదు. సెకనుకు 10 తూటాలను పేలుస్తుంది. దీని ప్రభావ పరిధి (ఎఫెక్టివ్ ఫైరింగ్ రేంజి) 500 మీటర్లు ఉంటుంది.
(రచయిత- సంజీవ్ బారువా)