ఏఐసీసీ భేటీ వరకు సోనియానే సారథి..
వర్కింగ్ కమిటీ సమావేశంలో నాయకత్వ మార్పుపై 7 గంటలపాటు సుదీర్ఘంగా చర్చించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు. సోనియాగాంధీనే అధ్యక్షురాలిగా కొనసాగాలని సభ్యులు కోరారని, అందుకు ఆమె అంగీకరించినట్లు వెల్లడించారు.
"కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ 7 గంటలపాటు జరిగింది. మీడియాలోకానీ, బహిరంగంగానీ పార్టీ అంతర్గత విషయాలు చర్చించరాదని సీడబ్యూసీ నిర్ణయించింది. పార్టీ ప్రయోజనాలు పరిరక్షిస్తూ క్రమశిక్షణతో అంతర్గత విషయాలను పార్టీ వేదికలపైనే ప్రస్తావించాలని.. అందరినీ సీడబ్యూసీ కోరింది. ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొనే నిమిత్తం అవసరమైన సంస్థాగత మార్పులు చేసేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలికి సీడబ్ల్యూసీ అధికారం కట్టబెట్టింది. పరిస్థితులు అనుకూలించి.. ఏఐసీసీ సమావేశం నిర్వహించే వరకూ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగాలని సోనియాగాంధీని సీడబ్యూసీ ఏకగ్రీవంగా కోరింది."
- కేసీ వేణు గోపాల్
ఏఐసీసీ భేటీలో అధ్యక్ష ఎన్నిక
కాంగ్రెస్ అనేది పెద్ద కుటుంబమని, అభిప్రాయ భేదాలు సహజమని పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా వెల్లడించారు. లేఖ రాసిన నేతలపై ఎలాంటి కోపం లేదని సోనియా చెప్పినట్లు పేర్కొన్నారు. అవకాశం చూసుకుని ఏఐసీసీ పూర్తి సమావేశం నిర్వహిస్తామని, అదే భేటీలో అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని స్పష్టం చేశారు.