దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అయితే సెప్టెంబర్ నెల సగం ముగిసేనాటికి దేశంలో కరోనా తీవ్రత అత్యధిక స్థాయికి చేరే అవకాశముందని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా(భారత ప్రజారోగ్య సంస్థ) అధ్యక్షుడు కే శ్రీనాథ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజలు సరైన నిబంధనలు పాటిస్తూ, ప్రభుత్వం తగిన చర్యలు చేపడితే సెప్టెంబర్ నాటికి కరోనా తీవ్రత అత్యధిక స్థాయి ముగుస్తుందని.. లేకపోతే అది మరింత ఆలస్యమవుతుందని పేర్కొన్నారు.
భారత్లో వైరస్ కేసుల సంఖ్య 10లక్షలు దాటిన నేపథ్యంలో కరోనా విస్తరిస్తున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు శ్రీనాథ్ రెడ్డి.
"ఈ స్థాయిలో వైరస్ వ్యాప్తి చెందకుండా మనం కట్టడి చేసి ఉండాల్సింది. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. వైరస్ను నియంత్రించవచ్చు. శక్తిమంతమైన ప్రజా ఆరోగ్య నిబంధనలు, ప్రజలు మాస్కులు, భౌతిక దూరాన్ని పాటిస్తే.. మరో రెండు నెలల్లో దేశంలో కరోనా తీవ్రత అత్యధిక స్థాయి(ఉచ్ఛస్థితి)కి చేరుకునే అవకాశముంది. ఇది ప్రభుత్వం-ప్రజలపై ఆధారపడి ఉంది."
--- శ్రీనాథ్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు.
రెండో దశ లాక్డౌన్ వరకు నిబంధనలు కఠినంగా అమలయ్యాయని పేర్కొన్న శ్రీనాథ్ రెడ్డి.. ఆంక్షలను కొంతమేర సడలించడం వల్ల వైరస్ ఉద్ధృతి పెరిగిందన్నారు. కానీ లక్షణాలున్న వారి కోసం ఇంటింటి సర్వే చేపట్టడం, పరీక్షలు విస్తృతంగా నిర్వహించడం, కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడం సహా ఇతర చర్యలు కఠినంగా చేపట్టి ఉండేదని అభిప్రాయపడ్డారు. ఆంక్షలను పూర్తిగా సడలించడం వల్ల పరిస్థితి తీవ్రంగా మారిందన్నారు.
దేశంలో కొత్తగా 34,884 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 671 మంది మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి:- 'కరోనా వేళ ఎన్నికల నిర్వహణకు సూచనలు ఇవ్వండి'