దేశవ్యాప్తంగా కరోనా పరీక్షలు సోమవారం ఉదయం నాటికి కోటి మార్కును దాటాయి. ఈ విషయాన్ని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది.
"సోమవారం ఉదయం 11 గంటల వరకు 1,00,04,101 నమూనాల పరీక్షలు జరిగాయి. ఆదివారం ఒక్క రోజే 1,80,595 పరీక్షలు నిర్వహించారు."
--- లోకేశ్ శర్మ, ఐసీఎంఆర్ సైంటిస్ట్-మీడియా కోఆర్డినేటర్.
దేశవ్యాప్తంగా 1,105 పరీక్ష కేంద్రాలు ఉన్నాయన్నారు శర్మ. వీటిలో 788 ప్రభుత్వానికి చెందినవని.. 317 ప్రైవేటు ల్యాబ్లని వివరించారు. రోజువారీ పరీక్షల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోందన్నారు. గడిచిన 14 రోజుల్లో సగటున రోజుకు 2 లక్షల నమూనాలను పరీక్షించినట్టు వెల్లడించారు.
ల్యాబ్లు కూడా...
తొలుత.. పుణెకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలోనే వైరస్ పరీక్షలు నిర్వహించేవారు. అనంతరం లాక్డౌన్ ప్రారంభమైనప్పుడు 100 ల్యాబ్లను ఏర్పాటు చేశారు. జూన్ 23న.. ఆ సంఖ్య 1000కి చేరింది.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పంజా విసురుతోంది. కొత్తగా 24,248కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 6,97,413కు చేరింది. మరో 425మంది మరణించారు. మృతుల సంఖ్య 19,693కు పెరిగింది.
ఇదీ చూడండి:- సరైన మార్గనిర్దేశంతో భారతీయ టీకా