దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 36,24,196 మంది వైరస్ను జయించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
రికార్డు స్థాయిలో ఒక్కరోజులో 81,533 మంది మహమ్మారి నుంచి విముక్తి పొందారు. తాజాగా కోలుకున్నవారిలో మహారాష్ట్రలో 14వేలకుపైగా, కర్ణాటకలో 12వేలకుపైగా బాధితులు ఉన్నారు. దీంతో దేశవ్యాప్త రికవరీ రేటు 77.77 శాతానికి ఎగబాకిందని ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు అంతకంతకూ తగ్గుతూ 1.66 శాతానికి పడిపోవడం ఊరటనిస్తోంది.
ఒక్కరోజు వ్యవధిలో దేశవ్యాప్తంగా రికార్డుస్థాయిలో 97,570 కొత్త కేసులు వెలుగుచూడగా.. ఇందులో మహారాష్ట్రలోనే 24వేల మందికిపైగా ఉన్నారు. ఆంధ్ర, కర్ణాటకల్లో 9వేలకుపైగా కొత్తకేసులు బయటపడ్డాయి. దేశంలో ఇప్పటివరకు మొత్తం 46,59,984 మందికి వైరస్ సోకగా.. వారిలో 60 శాతం కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, దిల్లీల్లోనే నమోదవుతున్నాయని ఆరోగ్యశాఖ పేర్కొంది.
తాజాగా నమోదైన 1,201 మరణాల్లో 36 శాతం మంది మహారాష్ట్ర వారు కాగా.. కర్ణాటకలో 130 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 77,472 మంది కరోనాతో మృతి చెందగా.. వారిలో 69 శాతం మంది మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, దిల్లీల్లోనే చనిపోయినట్లు ఆరోగ్యశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇదీ చదవండి: 'కరోనాకు విరుగుడు వచ్చే వరకు నిర్లక్ష్యం వద్దు'