లద్దాఖ్‌లో భారత సైన్యంతో ఘర్షణకు దిగుతున్న చైనా.. ఉత్తరాఖండ్ సరిహద్దులో కొత్త నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. నేపాల్‌లోని టింకర్-లిపు పాస్‌కు దగ్గర్లో గుడిసెలు వంటి నిర్మాణాలను ఏర్పాటు చేస్తోంది. టింకర్ లిపు పాస్‌కు 8 కి.మీ దూరంలో ఉన్న జొజో గ్రామంలోని చంపా మైదానంలోనూ నిర్మాణాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఉత్తరాఖండ్ సరిహద్దుల వెంబడి చైనా చేపట్టిన తాజా కార్యకలాపాలపై భారత భద్రతా సంస్థలు నిఘా ఉంచాయని అధికార వర్గాలు వెల్లడించాయి. నేపాల్ సరిహద్దు కలిసే ప్రాంతంలో చైనా పీఎల్ఏ(పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేశాయి.
రంగంలోకి నేపాల్!
మరోవైపు లిపులేఖ్ ప్రాంతంలో భారత సైన్యం కదలికలను నిశితంగా పరిశీలించాలని నేపాల్ ప్రభుత్వం తన భద్రతా దళాలను ఆదేశించినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. 'నేపాల్ సాయుధ పోలీస్ దళం(ఎన్ఏపీఎఫ్)'కు ఆ దేశ హోంశాఖ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపాయి. లిపులేఖ్ ప్రాంతంలో 44 బెటాలియన్ల ఎన్ఏపీఎఫ్ బలగాలను మోహరించినట్లు వెల్లడించాయి. లిపులేఖ్ అంశంలో నేపాల్‌తో వివాదం కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.
భద్రత పెంచుకుంటున్న చైనా
అటు చైనా కూడా లిపులేఖ్ ప్రాంతంలో భద్రతను పెంచుకుంటోంది. 150 లైట్ కంబైన్డ్ ఆర్మ్స్ బ్రిగేడ్ దళాలను మోహరించినట్లు తెలిసింది. ఈ బలగాలు ఆగస్టులోనే ట్రైజంక్షన్‌కు చేరుకున్నట్లు సమాచారం. భారత సరిహద్దుకు 10 కిలోమీటర్లు దూరంలో ఉన్న పాలా ప్రాంతంలో ఉన్న బలగాలతో వీరు కలిసినట్లు తెలుస్తోంది.
రహదారి నిర్మాణాలు
చైనాతో ఘర్షణ నేపథ్యంలో భారత్ సైతం దూకుడు పెంచింది. ఉత్తరాఖండ్ చమోలిలో మౌలిక సదుపాయాల కల్పనను సరిహద్దు రహదారి సంస్థ(బీఆర్ఓ) వేగవంతం చేసింది. సైనికులను తక్కువ సమయంలోనే సరిహద్దుకు చేర్చేందుకు ఉపయోగపడే రహదారి నిర్మాణం పూర్తి చేసింది. భారత్‌లోని చిట్టచివరి చెక్‌పాయింట్ అయిన రిమ్ఖిమ్ను ఈ రహదారి కలుపుతుంది.
అదే సమయంలో గ్యాల్దగ్ చెక్‌పోస్ట్ నుంచి నీతి పాస్‌లోని లోయ వరకు నిర్మిస్తున్న రహదారి పనులు కొనసాగుతున్నాయి.
ఇదీ చదవండి- 'ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సైన్యం సిద్ధం'