చాచి కొడితే చైనా మేజర్ ముక్కు పగిలింది - india-china border standoff
తమ భూభాగాన్ని ఎవరైనా ఆక్రమించి.. అక్కడి నుంచి వెళ్లగొట్టాలని ప్రయత్నిస్తే ఎంత కోపం వస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే సరిహద్దులో అయితే.. సైనికుల రక్తం ఉడికిపోతుంది. సిక్కిం సరిహద్దులో అదే జరిగింది. సిక్కిం సరిహద్దులో గస్తీ కాస్తున్న భారత లెఫ్టినెంట్‌కు చైనా మేజర్ ఈ భూభాగం తమది.. వెనక్కి వెళ్లిపో అంటూ హెచ్చరికలు చేశాడు. దీంతో కోపంతో ఊగిపోయిన భారత లెఫ్టినెంట్ చైనా మేజర్‌ను చాచిపెట్టి కోట్టాడు.
'ఏయ్ ఇది మా భూభాగం.. వెళ్లిపో వెనక్కి..' గస్తీలో ఉన్న భారత లెఫ్టినెంట్‌కు చైనా మేజర్ హెచ్చరిక అది!
తాను ఉన్న భూభాగం కచ్చితంగా సిక్కింలోదేనని భారత గస్తీదళానికి స్పష్టంగా తెలుసు. కానీ చైనా సైనికులు పదేపదే బాగా రెచ్చగొడుతున్నారని అర్థమవుతోంది. దీంతో భారత గస్తీ బృందానికి నేతృత్వం వహిస్తున్న లెఫ్టినెంట్‌కు కోపం తన్నుకొచ్చింది. తన మాతృభూమిలోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా బెదిరిస్తున్న చైనా మేజర్‌పైకి ఒక్కసారిగా దూసుకెళ్లి అతని మూతిపై చాచికొట్టాడు. ఆ దెబ్బకి... చైనా మేజర్ ముక్కుపగిలింది. రక్తం కారుతుండగా కింద పడిపోయాడు. భారత వీరసైనికుల ఆగ్రహాన్ని గ్రహించిన చైనా గస్తీదళం మెల్లగా వెనక్కి మళ్లింది.
కొన్ని రోజుల క్రితం సిక్కిం సరిహద్దులో జరిగిన ఘటన ఇది. భారత యువ సైనికాధికారి సైన్యంలో చేరి కొద్దికాలమే అయింది. చూడటానికి బక్కపల్చగా కనిపించినా గుండెల నిండా ధైర్యం, దేశాన్ని ఏమాత్రం తక్కువ చేసి మాట్లాడినా తట్టుకోలేడు తత్వం. ఈ ఘటన సమాచారం సైనిక ఉన్నతాధికారులకు చేరింది. మొదట్లో ఆందోళన చెందినా మన దేశంలోకి చొచ్చుకొచ్చిన చైనా మూకలపై దాడి సరైన నిర్ణయమేనని తీర్మానించారు.
కుబుంబం మొత్తం సైన్యంలోనే..
యువసైనికాధికారి కుటుంబం దేశసేవలోనే ఉండటం విశేషం. ఆయన తాత, తండ్రి సైన్యంలో సేవలందించారు. ఆయన సోదరి కూడా సైన్యంలోనే విధులు నిర్వహిస్తోంది. యువ సైనికాధికారిని పక్కన ఉన్న సహచరులు బలవంతంగా నిలువరించి శిబిరానికి తీసుకువచ్చినట్టు సమాచారం.
ఇంతకీ ఆ యువసైనికాధిపేరు చెప్పనే లేదు కదా! అతని పేరు బిరోల్ దాస్. కొద్దికాలం క్రితమే శిక్షణ పూర్తి చేసుకొని విధుల్లో చేరాడు. 2017లో ఎన్డీయేకు ఎంపికైన అతను శిక్షణలో మంచి ప్రతిభను చాటాడు. చైనా మేజర్‌ను కొట్టిన అంశంపై ఆయన తండ్రితో ప్రస్తావించగా మీడియాతో తన అభిప్రాయాలను పంచుకునేందుకు ఇష్టపడలేదు. అయితే దేశ సేవలో ప్రతి సైనికుడు చూపించిన నిబద్ధతనీ, వీరత్వాన్నే తన కుమారుడు ప్రదర్శించాడని వెల్లడించారు. "ఆయుధాలు, మౌలిక సౌకర్యాలు.. తదితర అంశాల్లో చైనా సైన్యం మన కంటే ముందు ఉండొచ్చు. కానీ మన సైనికులు బరిలోకి దిగితే వారి ధైర్యసాహసాల ముందు వారు సరిపోరు. దేశభక్తి, తెగింపు భారతీయులకు అదనపు శక్తి" అని ఉద్వేగంతో చెప్పారు.
ఇదీ చూడండి: చైనా మంత్రి ఎదుటే డ్రాగన్‌పై జైశంకర్ పంచ్!